సార్వత్రిక ఎన్నికల్లో విజయదుందుభి మోగించిన వైసీపీ... స్థానిక సంస్థల్లో కూడా అదే జోరు కొనసాగించాలని తహతహలాడుతోంది. కోల్పోయిన ప్రాభవాన్ని ఈ ఎన్నికల్లోనైనా తెచ్చుకోవాలన్న లక్ష్యంతో టీడీపీ అడుగులు వేస్తోంది. టీడీపీ కంచుకోట అయిన అనంతలో ఈ పరిస్థితి మరీ ఎక్కువగా కనిపిస్తోంది. జడ్పీ పీఠాన్ని కైవసం చేసుకొని జిల్లాలో తాము ఏమీ తగ్గలేదని చెప్పేందుకు ఆ పార్టీ ప్రయత్నిస్తోంది. అయితే వైసీపీ ఇంకా దూకుడుగా వెళ్లి....నోటిఫికేషన్ కు ముందే ఎన్నికల ప్రిపరేషన్ లోకి దిగింది. ఇన్ ఛార్జి మంత్రి బొత్స నేరుగా జిల్లాలో ఎన్నికల వ్యూహాలపై అస్త్రాలు సిద్ధం చేస్తున్నారు. 

 

ప్రస్తుతం రాష్ట్రంలో అమరావతి రాజధానిపై అధికార ప్రతిపక్షాల పోరు పీక్ లో సాగుతోంది. రెండు పార్టీలకు స్థానిక సంస్థల రూపంలో మరో సవాల్ ఎదురైంది. హైకోర్టు ఎన్నికలు నిర్వహించాలని ఆదేశాలివ్వడంతో నిన్నటి వరకు గ్రామాల్లో స్తబ్ధుగా ఉన్న రాజకీయాలు మళ్లీ ఒక్కసారిగా వేడెక్కాయి. సార్వత్రిక ఎన్నికలు జరిగిన 7 నెలల తరువాత ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. సార్వత్రిక ఎన్నికల కంటే గ్రామాల్లో ఈ ఎన్నికలే రసవత్తరంగా సాగుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో అనంతపురం జిల్లాలో ఇప్పుడు ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. వాస్తవంగా అనంతపురం జిల్లా టీడీపీకి కంచుకోటగా ఉండేది. గత ఎన్నికల్లో 14 అసెంబ్లీలకు గాను 12 స్థానాలను, రెండు పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీ కోలుకోలేని దెబ్బతింది. ఇప్పుడు స్థానిక సంస్థల్లో ఎలాగైనా పట్టు సాధించాలని వ్యూహాలు రచిస్తోంది. దీనికి ధీటుగా వైసీపీ వెళ్తోంది. ఇప్పటికే ఎమ్మెల్యేలు ఎన్నికలకు గ్రౌండ్ ప్రిపేర్ చేశారు. ఇక అధిష్టానం కూడా ఎన్నికల్లో సత్తా చాటాలని అందుకు తగ్గ ప్రయత్నాలు మొదలు పెట్టాలని సూచించింది. 

 

ఇక...ఇటు టీడీపీకి అటు వైసీపీకి కాస్త ఇబ్బంది పెట్టిన అంశం ఏంటంటే.. రెండు పార్టీలకు ఛాలెంజ్ గా ఉన్న జెడ్పీ పీఠం. ఈ స్థానం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇద్దరికీ అవసరమే. కాని ఆ స్థానం ఎవరూ ఊహించని విధంగా జడ్పీ ఛైర్మన్ స్థానం ఎస్సీకి రిజర్వ్ అయింది. ఇది రెండు పార్టీలకు షాకింగే అని చెప్పాలి. వైసీపీలోని చాలా మంది నేతలు ఈ స్థానంపై ఆశలు పెట్టుకున్నారు. ఎస్సీకి రిజర్వ్ కావడంతో అందరూ నిరుత్సాహానికి గురయ్యారు. ఇప్పుడు రెండు పార్టీలకు ఆ స్థానంలో ఎవర్ని కూర్చోబెట్టాలన్నది అర్థం కాని పరిస్థితి. ప్రస్తుతం ఆ స్థాయి నేతలు ఎవరు ఉన్నారన్నదానిపై అన్వేషణ మొదలుపెట్టారు. రెండు పార్టీల్లోనే చాలా మంది ఎస్సీ సామాజిక వర్గ నేతలు ఉన్నా.. వారంత ఎమ్మెల్యే స్థానాలకే పోటీ పడాలనుకుంటున్నారు. ఇప్పుడు జడ్పీ పీఠం ఎవరు వస్తారో చూడాలి. మరోవైపు టీడీపీ మాత్రం అసలు ఎన్నికల మూడ్ లో కనిపించడం లేదు. అధినేత అమరావతి ఇష్యూకే పరిమితం కావడంతో స్థానిక సంస్థలపై దృష్టి సారించే వారు కనిపించడం లేదు.

 

గ్రామాల్లో వైసీపీని ఎదుర్కొని నిలబడాలంటే అధిష్టానం నుంచే బలమైన సపోర్ట్ కావాలి. ఇప్పటి వరకు ఆ దిశగా ఎలాంటి ప్రకటనలు రాలేదు. కనీసం స్థానిక సంస్థలకు సంబంధించి ఒక్క సమావేశం కూడా జరగలేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: