ఏపీ రాజకీయాల్లో జనసేన ప్రభావం అంతగా లేకపోయినా, ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం ఏపీలో ప్రధాన ప్రతిపక్షం తామే అన్నట్టుగా హడావుడి చేస్తున్నారు. రెండు రోజుల క్రితం హడావుడిగా ఢిల్లీ వెళ్లిన పవన్ అక్కడ బిజెపి పెద్దలను కలిసేందుకు ప్రయత్నించారు. ఏపీ రాజకీయ వర్గాల్లో మాత్రం బిజెపి జనసేన విలీనం, జనసేన తో బిజెపి పొత్తు ? ఇలా అనేక రకాల చర్చలు నడుస్తున్నాయి. ఇక ఢిల్లీ టూర్ సందర్భంగా పవన్ ఇదే విషయంపై కేంద్ర పెద్దలను కలవబోతున్నారంటూ వార్తలు వినిపించాయి. అయితే అసలు విషయం ఏమిటో ఇప్పటి వరకు తెలియలేదు. తాజాగా ఢిల్లీ పర్యటనలో ఉన్న పవన్ అక్కడ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, ఆర్ఎస్ఎస్ నాయకులతో రహస్యంగా భేటీ అయినట్లు ప్రచారం జరుగుతోంది. 


ఇప్పటి వరకు బీజేపీ నాయకులు ఎవరూ పవన్ కు అపాయింట్మెంట్ ఇవ్వకపోవడంతో పవన్ అక్కడే వేచి చూస్తున్నారు. ఈ క్రమంలో ఆర్ఎస్ఎస్ నాయకులను పవన్ రహస్యంగా కలుసుకోవడంపై రకరకాల చర్చలు నడుస్తున్నాయి. పవన్ బీజేపీలోకి వెళ్లేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నట్టు రాజకీయ వర్గాల్లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే ఢిల్లీ పర్యటనకు సంబంధించి అన్ని వివరాలను జనసేన పార్టీ గోప్యంగా ఉంచుతోంది. కనీసం దీనిపై పార్టీ శ్రేణులకు కూడా సమాచారం ఉండడం లేదు.


 ఇక పవన్ ఢిల్లీ పర్యటన ముగించుకుని ఈ రోజు కాకినాడ వెళ్తున్నట్టు తెలుస్తోంది. కాకినాడలో జనసేన కార్యకర్తలపై వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనుచరులు రాళ్ల దాడి చేయడం తెలిసిందే. దీనిపైన ఘాటుగా స్పందించిన పవన్ ఢిల్లీ నుంచి నేరుగా తాను కాకినాడ కి వస్తాను అంటూ ప్రకటించారు. దీంతో మరోసారి వైసిపి, జనసేన మధ్య యుద్ధవాతావరణం నెలకొనే పరిస్థితి కనిపిస్తోంది. బిజెపి నేతలు అపాయింట్మెంట్ ఇవ్వకపోవడంతో పవన్ పర్యటన అసంతృప్తిగానే ముగుస్తున్నట్టు కనిపిస్తోంది. 


అయితే ఇప్పుడు మాత్రం పవన్ ఆర్ఎస్ఎస్ నాయకులతో రహస్యంగా భేటీ అయ్యి ఏ విషయంపై చర్చించారు ? వారు ఏ హామీ ఇచ్చారు అనే విషయం  ఇప్పటి వరకు బయటకు పొక్కకుండా పవన్ జాగ్రత్తలు తీసుకున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: