వివాదాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ అయిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ భార‌త్ విష‌యంలో త‌న అజ్ఞానాన్ని బ‌య‌ట‌పెట్టుకున్నారు. భార‌త్ విష‌యంలో ఆయ‌న వేసిన ప్ర‌శ్న‌ల‌కు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీ షాక్ అయ్యార‌ట‌. పులిట్జర్‌  బహుమతి గెలుచుకున్న ఇద్దరు అమెరికన్‌ జర్నలిస్టులు రాసిన తాజా పుస్తకంలో ఆస‌క్తిక‌ర విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయి. అమెరికా అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ట్రంప్‌ తొలి మూడేండ్ల పదవీ కాలంలో జరిగిన కొన్ని ఘటనలను ఫిలిప్‌ రక్కర్‌, క్యారల్‌ డి లియోనిగ్‌ గ్రంథస్తం చేశారు. ‘ఏ వెరీ స్టేబుల్‌ జీనియస్‌' అన్న పేరు తో ఉన్న ఆ పుస్తకంలో 417 పేజీలున్నాయి. ప్రధాని మోదీని తొలుత విస్మయానికి, ఆపై దిగ్భ్రాంతికి, ఆ తరువాత విరక్తితో తన పదవికి రాజీనామా చేయాలనిపించేలా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఒకసారి వ్యాఖ్యానించాడ‌ని ఆ జ‌ర్న‌లిస్టులు పేర్కొన్నారు. 

 

భార‌త ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీతో ట్రంప్‌ జరిపిన ఒక ఆసక్తికర సంభాషణను కూడా ఇందులో చేర్చారు. ఓ సారి వారిద్దరి భేటీలో.. ట్రంప్‌ మోదీతో ‘మీకు చైనాతో సరిహద్దు ఉందా?’ అని ప్రశ్నించారట. ఈ ప్రశ్న విని మోదీకి దిమ్మ తిరిగిపోయిందట. మోదీ క‌ళ్ల‌ల్లో కనిపించిన భావాలను బట్టి తొలుత ఆయన విస్మయానికి గురయ్యారని, ఆ తరువాత దిగ్భ్రాంతి చెందారని.. ఇక విరక్తితో తన పదవికి రాజీనామా చేసేయాలన్న నిర్ణయాన్ని వచ్చారనిపించిందని రచయితలు పేర్కొన్నారు. మోదీ ఆ సమావేశం నుం చి వెళ్తూ.. ‘ఇతడేం మనిషి! ఈయనను నమ్ముకోలేం.. మా భాగస్వామిగా భావించలేం’ అని అన్నారని, ఈ సంగతి ట్రంప్‌ సన్నిహితుడు తమకు తెలిపారని వివరించారు. ఈ భేటీ తర్వాత అమెరికాతో దౌత్య సంబంధాలలో భారత్‌ ఒక అడుగు వెనుకకు వేసిందని తెలిపారు. అయితే ఈ ఘటన ఏ ఏడాదిలో జరిగిందో మాత్రం వారు తెలుపలేదు.

 

సదరు పుస్తకంలోని ఈ ఘటనను వాషింగ్టన్‌ పోస్ట్‌ బుధవారం ప్రచురించింది. అమెరికా అధ్యక్షునికి భౌగోళిక అం శాలపై ఎటువంటి పరిజ్ఞానం లేదన్నది. భారత్‌ చైనా మధ్య 3,488 కి.మీ.పొడవైన సరిహద్దు ఉందని, ఇందులో పలు ప్రాంతాల్లో భూభాగం విషయమై ఉభయ దేశాల మధ్య దశాబ్దాలుగా పరిష్కారంకాని వివాదమున్నదని గుర్తు చేసింది. కాగా అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్‌ పాలనపై, రష్యాపై చేసిన రచనలకు గాను 2018లో రచయితలిద్దరూ పులిట్జర్‌ బహుమతి గెలుచుకున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: