అక్రమాస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కుంటున్న ఏపీ సీఎం జగన్ పార్టీ అధికారంలోకి రాకముందు ప్రతి శుక్రవారం క్రమం తప్పకుండా సీబీఐ కోర్టులో విచారణ నిమిత్తం హాజరయ్యేవారు. అయితే ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు చేపట్టిన తరువాత బిజీ షెడ్యూల్ కారణంగా జగన్ కోర్టుకు హాజరవ్వడం మానేశారు. అంతే కాకుండా తాను సీఎంగా బిజీ షెడ్యూల్ తో ఉంటున్నాని, కోర్టు హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ సీబీఐ కోర్టులో ఆయన పిటిషన్ వేయించారు. అయితే దీనిపై జగన్ విచారణకు హాజరుకావాలని ఈ నెల 10న న్యాయమూర్తి సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. 


ఈ నేపథ్యంలో మంత్రి సబితతోపాటు, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, పెన్నా ప్రతాప్ రెడ్డి, ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి, వీడి రాజగోపాల్, రిటైర్డ్ ఐఏఎస్ శామ్యూల్ తదితరులు నాంపల్లిలోని సీబీఐ కోర్టులో హాజరయ్యారు. కానీ ఈ రోజు జగన్ కోర్టుకి హాజరవ్వాల్సినా జగన్ పిటిషన్ వేయడంతో ఆయనకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇచ్చారు. 
ఈడీ కేసులో వ్యక్తిగత హాజరు నుంచి తనకు మినహాయింపు ఇవ్వాలని జగన్ గతంలో పిటిషన్ వేశారు. అలాగే డిశ్చార్జ్ పిటిషన్లు అన్నింటిని కలిపి విచారించాలని కూడా వేసిన పిటిషన్లపై వాదనలు గత వారం పూర్తయ్యాయి. వాటిపై వచ్చేవారం తీర్పు వెలువడబోతోంది.

 

జగన్ కు ఈడీ కేసుల్లో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు లభిస్తుందా అనే దానిపై న్యాయ వర్గాల్లోనూ తీవ్రమైన చర్చ నడుస్తోంది. ఇప్పటికే సీబీఐ నమోదు చేసిన అక్రమాస్తుల కేసులో వ్యక్తిగత మినహాయింపును కోర్టు తోసిపుచ్చడంతో ఈడీ కేసులో వేసిన పిటిషన్ ఏమవుతుంది అనే దానిపై అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. కేంద్రంలో బీజేపీ ఇప్పుడు వైసీపీని టార్గెట్ గా చేసుకోవడం, జనసేన బీజేపీ పార్టీలు కలిసి పొత్తు పెట్టుకోవడంతో జగన్ పై సీబీఐ, ఈడీలు మరింతగా పట్టు బిగించే అవకాశం కనిపిస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: