జనసేన బిజెపి పార్టీలు పొత్తు పెట్టుకోవడంపై ఏపీ రాజకీయ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పవన్ తాను సాంప్రదాయ రాజకీయాలకు చెక్ పెట్టాలా సరికొత్త రాజకీయాల చేస్తానంటూ ప్రకటించి చివరికి బీజేపీతో పొత్తు పెట్టుకోవడం పై రకరకాల అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదే విషయమై సొంత పార్టీ నేతల్లోనూ వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇక జనసేన, బిజెపి రాజకీయ ప్రత్యర్థుల గురించి అయితే చెప్పనవసరం లేదు. తాజాగా ఈ పొత్తుల వ్యవహారం పై వైసీపీ ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి స్పందించారు. జనసేన, బిజెపిలు పొత్తు పెట్టుకోవడం పెద్ద ఆశ్చర్యం ఏమీ లేదని ఆయన వ్యాఖ్యానించారు. 


ఈ సందర్భంగా పవన్ పై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తాను మొదటి నుంచి బిజెపితో కలిసే ఉన్నానని కాకపోతే మధ్యలో కొంత అభిప్రాయ భేదాలు వచ్చి దూరంగా ఉన్నానంటూ పవన్ చెప్పడాన్ని అమర్నాథ్ తప్పుపట్టారు. బిజెపికి పవన్ మొదటి నుంచి మద్దతుదారులుగా ఉన్నాడని, అయితే మధ్యలో ఈ రెండు పార్టీల మధ్య దూరం ఎందుకు పెరిగింది అనే విషయాన్ని స్పష్టం చేయాలంటూ అమర్నాథ్ డిమాండ్ చేశారు. అప్పట్లో ప్రత్యేక హోదా ఇస్తామని పవన్ హామీ ఇచ్చి మాటతప్పారని, అందుకే వీరి మధ్య గ్యాప్ వచ్చిందా ? లేక అప్పుడు పాచిపోయిన లడ్డూలు ఇప్పుడు బాగున్నాయనే అభిప్రాయం పవన్ లో వచ్చిందా అంటూ అమర్నాథ్ ఎద్దేవా చేశారు. లేకపోతే చంద్రబాబు చెప్పడంతో పవన్ బీజేపీకి దూరమయ్యారా ? ఇప్పుడు బాబు పొత్తు పెట్టుకోమన్నాడా అంటూ అమర్నాథ్ నిలదీశారు. 


ఎన్నికల ముందు వామపక్ష పార్టీలను కలుపుకుని వెళ్లి వారితో పొత్తు పెట్టుకుని పోటీకి దిగిన పవన్ ఇప్పుడు వారిని పక్కన పెట్టేయడం పై వారు పవన్ ను ప్రశ్నించడంతో నేనేమన్నా వారికి బాకీ ఉన్నానా అంటూ పవన్ మాట్లాడడాన్ని అమర్నాథ్ తప్పుబట్టారు. రాజకీయాల్లో ఉన్న వ్యక్తులకు కమిట్మెంట్ చాలా అవసరమని, కానీ పవన్ లో ఆ కమిట్మెంట్ లేదని ఆయన విమర్శించారు. రాజకీయాల్లో బాకీలు, వడ్డీలు ఉండవని, నాయకుల వ్యక్తిత్వం, మాట తీరు, నిజాయితీ వీటిని ప్రజలు పరిగణలోకి తీసుకుంటారని అన్నారు. కానీ పవన్ డిక్షనరీలో ఇవేవీ లేవని, అసలు వాటికి అర్ధాలే ఆయనకు తెలియదని చెప్పారు. 


మీరు ఎప్పుడు రాజకీయ అవసరాల కోసం పార్టీల చుట్టూ తిరుగుతాయని, అంత దాగుడుమూతలు ఎందుకు ? మీ పార్టీ ని అధికారికంగా బిజెపిలో కానీ, టిడిపిలో కానీ కలిపేస్తే మంచిదని అమర్నాథ్ సూచించారు. అలా చేయడం మానేసి కేవలం వైసీపీ ప్రభుత్వం కారణంగానే పొత్తు పెట్టుకోవాల్సి వచ్చింది అన్నట్టుగా పవన్ మాట్లాడటం సరికాదన్నారు. పవన్ మాటలను ప్రజలు ఎవరు నమ్మేందుకు సిద్ధంగా లేరని గుడివాడ అమర్నాథ్ చెప్పుకొచ్చారు. 


రాష్ట్రంలో జరగకూడని సంఘటనలు ఏవో జరిగిపోతున్నట్టుగా జనసేన బీజేపీలు హడావుడి చేస్తున్నాయని, మీరు ఎవరు ఎవరితో పొత్తు పెట్టుకున్నా మాకేమి అభ్యంతరం లేదంటూ చెప్పారు. జగన్ వెంట ప్రజలు ఎప్పటికీ ఉంటారని, అసలు ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీ అమలు చేసిన దమ్మున్న నాయకుడు జగన్ అంటూ ఆయన చెప్పారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: