మిత్రపక్షాలైన బిజెపి, జనసేన పై ఎటువంటి కామెంట్లు చేయవద్దని చంద్రబాబునాయుడు తమ్ముళ్ళని ఆదేశించాడు. గురువారం రెండు పార్టీల నేతల సమావేశం తర్వాత మీడియా మీట్ గురించి తర్వాత  చంద్రబాబు ఆధ్వర్యంలో నేతలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ బిజెపి, జనసేనల కలయికపై ఎవరూ ఏమీ మాట్లాడవద్దని ఆదేశించారు.   రెండు పార్టీల కలయిక వల్ల ఏమి జరుగుతుందో  కొద్ది రోజులు వేచి చూద్దామని చెప్పారట.

 

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే చంద్రబాబు, పవన్ మధ్య ఉన్న ఫెవికాల్ బంధం అందరికీ తెలిసిందే.  అలాంటిది చంద్రబాబును వదిలిపెట్టి పవన్ బిజెపితో పొత్తు పెట్టుకోవటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అయితే ముందు జాగ్రత్తగా చంద్రబాబే జనసేన అధిపతిని బిజెపిలోకి పంపారని వైసిపి నేతలు ఆరోపిస్తున్నారు. అంటే  నలుగురు టిడిపి రాజ్యసభ ఎంపిలను బిజెపిలోకి పంపినట్లట.

 

సరే పవన్ విషయాన్ని పక్కనపెడితే బిజెపికి దగ్గరవ్వాలని చంద్రబాబు కొంతకాలంగా చేస్తున్న ప్రయత్నాలు అందరూ చూస్తున్నదే. ఎన్డీఏలో నుండి తాను బయటకు వచ్చేసి తప్పు చేశానని విశాఖపర్యటన సందర్భంగా చంద్రబాబు బహిరంగంగానే అంగీకరించారు. తప్పు చేశానని ఒప్పుకోవటం చంద్రబాబు నైజానికి పూర్తి విరుద్ధం. అలాంటిది బహిరంగంగా ప్రకటించారంటేనే మళ్ళీ బిజెపికి దగ్గరవ్వాలని చంద్రబాబు ఎంతలా తహతహలాడుతున్నారో అర్ధమైపోతోంది.

 

తాజాగా కమలం పార్టీతో పొత్తులు పెట్టుకున్న పవన్  మెల్లిగా చంద్రబాబుకు కూడా ఏదన్నా మార్గం ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తారో ఏమో  చూడాలి. ఎలాగూ సుజనాచౌదరి, సిఎం రమేష్ లాంటి వాళ్ళు అందుకు ఎప్పటి నుండే ప్రయత్నిస్తున్నారు కాబట్టి పవన్ కూడా ప్రయత్నం చేయచ్చు చెప్పలేం. అందుకనే ఇపుడు గనుక టిడిపి నేతలు ఎవరన్నా రెండు పార్టీలపై  తొందరపడి కామెంట్లు చేస్తే వ్యవహారం చెడిపోతుంది. అందుకనే ముందుజాగ్రత్తగానే చంద్రబాబు ఎవరు నోరెత్తకుండా తాళాలు వేసేశారు. మరి పవన్ ఏమేరకు ప్రయత్నిస్తారో ? చంద్రబాబు ఆశలు ఎంత వరకూ నెరవేరుతాయో చూడాల్సిందే ?

మరింత సమాచారం తెలుసుకోండి: