క్షేత్రస్ధాయిలో  జరుగుతున్న రాజకీయ పరిణామాలు చూస్తుంటే ఇదే అనుమానం పెరుగుతోంది.  మొన్నటి సాధారణ ఎన్నికల్లో చాలా నియోజకవర్గాల్లో జనసేన అభ్యర్ధులే  టిడిపి అభ్యర్ధుల విజయవకాశాలపై  దెబ్బ కొట్టారు.  నిజానికి చంద్రబాబు వైసిపి అభ్యర్ధులను ఓడించటానికి  జనసేనను ప్రయోగించారు. అయితే ఆ ప్రయోగం వికటించి చివరకు టిడిపినే దెబ్బ కొట్టింది.

 

సరే ఆ విషయం చరిత్రనుకుంటే మళ్ళీ అదే జరగబోతోంది. ఇపుడీ విషయంలోనే తెలుగుదేశంపార్టీలో టెన్షన్ మొదలైంది. ఎందుకంటే తొందరలో స్ధానిక సంస్ధల ఎన్నికలు జరగబోతున్నాయి.  మామూలుగా అయితే మళ్ళీ లోపాయికారీ ఒప్పందంతో రెండోసారి కూడా టిడిపి+జనసేన అభ్యర్ధులు కలిసి వైసిపిని దెబ్బ కొట్టాలని అనుకున్నారు.

 

అయితే ఉరుములేని పిడుగు లాగ పవన్ వెళ్ళి ఎంచక్కా బిజెపి చంకనెక్కి కూర్చున్నారు. సరే కూర్చుంటే కూర్చున్నారని సరిపెట్టుకుందామని అనుకుంటే  చంద్రబాబునాయుడు విఫలమయ్యారని స్వయంగా పవనే ఆరోపించారు. పాలనలో జగన్ కూడా విఫలయ్యారని ఆరోపించినా అందులో పసలేదు. ఎందుకంటే చంద్రబాబు ఐదేళ్ళ పాలనను జగన్ ఏడు మాసాల పాలనతో ఎలా భేరీజు వేస్తారు ? 

 

సరే ఈ విషయాలు ఎలాగున్నా రేపటి స్ధానిక ఎన్నికల్లో  టిడిపి అభ్యర్ధులపై జనసేన దెబ్బ పడటం ఖాయమనే అనిపిస్తోంది. ఎలాగంటే బిజెపికి ప్రత్యేకంగా ఓటుబ్యాంకంటూ లేదు. అలాగని జనసేనకూ లేదు.  మొన్నటి ఎన్నికల్లో  పవన్ నమ్మకం పెట్టుకున్న కాపుల ఓట్లు కూడా జనసేనకన్నా వైసిపికే ఎక్కువ పడ్డాయి.  అదీగాకుండా వైసిపి ఓటుబ్యాంకేమో జగన్ కష్టపడి సంపాదించుకున్నది.

 

అంటే వైసిపియేతర ఓట్లను రేపటి ఎన్నికల్లో టిడిపి, కాంగ్రెస్, బిజెపి+జనసేన, వామపక్షాలు పంచుకోవాల్సుంటుంది.  మొన్నటి ఎన్నికల్లో బిజెపికి సుమారుగా 1 శాతం ఓట్లొచ్చాయి. అలాగే జనసేనకు సుమారు 5 శాతం వచ్చాయి. అంటే ఇపుడు రెండూ కలిశాయి కాబట్టి తమకొచ్చిన 6 శాతం ఓట్లను నిలుపుకుంటే ఆ మేరకు టిడిపికి మైనస్సే.

 

మొన్నటి ఎన్నికల తర్వాత చాలామంది నేతలు పార్టీని వదిలేశారు.  పవన్ బిజెపితో పొత్తు పెట్టుకోకపోతే జనసేన నుండి మళ్ళీ లబ్దిపొందుదామని చంద్రబాబు ప్రయత్నించే అవకాశం ఉంది. హఠాత్తుగా జరిగిన పొత్తులతో చంద్రబాబుకు ఇపుడా అవకాశం కూడా లేకుండా పోయింది.  తనతో పొత్తు పెట్టుకున్నందు వల్ల బిజెపికి జరిగిన ఉపయోగాన్ని చూపాల్సిన బాధ్యత కూడా ఉంది కాబట్టి పవన్  కష్టపడి పనిచేయచ్చు.  కాబట్టి రెండోసారి కూడా టిడిపిపై జనసేన దెబ్బ తప్పేట్లు లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: