ఆ పేరు తెలుగు జాతికి శాశ్వత చిరునామా.. ఆయన రూపం తెలుగు వాడి ఆత్మగౌరవానికి నిలువుటద్దం. జనమంతా తెలిసిన వాడు నాయకుడు కాదు.. జనమంటే తెలిసిన వాడే నిజమైన నాయకుడని నిరూపించిన వ్యక్తి... శక్తి ఆయనే. రాజకీయ వారసత్వం లేదు... దేశాన్నేలిన చరిత్రా లేదు.. కానీ తన వాళ్ల కోసం ఒక్కడిగా అడుగేశాడు.. ఆ అడుగే ప్రభంజనమైంది. అంతటి విజయం సాధించిన అన్నగారి వర్ధంతి నేడు.


దేశ రాజకీయ చరిత్రలో కొందరే జన నేతలుగా  మిగిలిపోతారు. వారిలో కూడా కొందరే ప్రజల హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకున్నారు. ప్రజాహిత పాలనకు నిలువుటద్దంగా గుర్తుండిపోయారు. మన ఏడుపదుల దాటిన మన ప్రజాస్వామ్యంలో చిరస్థాయిగా, చిరస్మరనీయుడిగా తెలుగు జాతి జనుల గుండెల్లో కొలువుండిపోయిన... వ్యక్తి.. శక్తి... నందమూరి తారక రామారావు.  

 

తెలుగు జాతి ఆత్మగౌరవం హస్తిన వీధుల్లో పరాభవానికి గురవుతుంటే ఈ మానధనుడి గుండె మండి పోయింది. ఢిల్లీ అహంకారంపై తిరుగుబావుటా ఎగరేసి, తల ఎత్తి తెలుగోడి సత్తా చాటిన వ్యక్తి ఎన్టీఆర్. రాజకీయ వారసత్వం లేదు... తాతలు, తండ్రుల చరిత్ర లేదు.. ఉన్నదల్లా ప్రజాభిమానం ఒక్కటే. రంగేసుకునే వాళ్లకు రాజకీయాలేంటని విమర్శించిన నోళ్లనే... ఔరా అనిపించేలా అడుగులేశారు. 


ఎన్టీఆర్ రాజకీయాల్లోకి అడుగు పెట్టే నాటికి తెలుగు సినీ రంగంలో ఆయనే టాప్‌ ఛైర్లో ఉన్నారు. రాజకీయాల్లోకి రాకపోయినా... ఆయనకు వచ్చే నష్టమేమీ లేదు. కానీ తనను దైవంలా ఆరాధించే తెలుగు ప్రజలకు కేంద్ర స్థాయిలో జరుగుతున్న అవమానాలు సహించలేక... తన తెలుగు ప్రజల కోసం, తన తెలుగు జాతి కోసం రాజకీయాల్లోకి అడుగు పెట్టారు.

 

అభిమాన నటుడు.. వెండితెర వేల్పు.. ఓట్లేయండంటూ ముందుకొచ్చేసరికి జనం నీరాజనాల పలికారు. నాటి నుంచి ఎన్టీయార్‌ వేసిన ప్రతి అడుగు సంచలనమైంది. పలికిన ప్రతి పలుకూ ప్రభంజనమైంది. తెలుగు వారి ఆత్మగౌరవానికి అగ్రస్థానమిస్తూ.. చైతన్యరథంపై అన్నగారు చేసిన యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఆ టైంలో పార్టీ పెట్టడమే ఓ సాహసం అనుకుంటే, దశాబ్దాల కాంగ్రెస్‌ను మట్టికరిపించి, నెగ్గుకు వచ్చాడు. 

 

చైతన్య రథాన్నే వేదికగా చేసుకుని జనంలోకి.. పేదవాడే నా దేవుడు... సమాజమే నా దేవాలయం అంటూ సాగిపోయారు. కూడు గూడు గుడ్డ అంటూ వచ్చిన ఎన్టీఆర్‌ పేదలకు తమ అవసరాలు తీర్చే దేవుడిగా కనిపించారు. జనం మధ్యే భోజనం... జనం మధ్యే స్నానపానాదులు... జనం మధ్యనే నిద్ర... ఇలా రాష్ట్రమంతా పర్యటించి తొలిసారి ఎన్నికల్లోనే సూపర్‌హిట్‌ కొట్టి... తెలుగువాడి సత్తా ఏంటో కేంద్ర కాంగ్రెస్‌కు రుచి చూపించారు. తెలుగువాడు తలచుకుంటే అధికార పీఠాన్ని ఎలా కైవసం చేసుకుంటారో... వందేళ్ల కాంగ్రెస్‌కు రుచి చూపించారు.

 

అన్నగారు తెలుగు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వగానే... మద్రాసీ ఆంధ్రులుగా తెచ్చుకుంటున్న పేరును చెరిపేస్తూ... తెలుగువాళ్ల స్వాభిమానానికి అంకురార్పణ చేశారు. ఆనాటి నుంచి ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ తెలుగునాట బలమైన రాజకీయ శక్తిగా అప్రహతిహతంగా సాగుతోందంటే దానికి అన్నగారు వేసిన పటిష్ట పునాదులు.. తీసుకున్న సాహసోపేత నిర్ణయాలు, అమలు చేసిన సంక్షేమ పథకాలే మూల కారణం. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: