ఏపీలో అధికార వైసీపీ చేసిన మూడు రాజధానుల ప్ర‌క‌ట‌న విభిన్న అభిప్రాయాల‌కు వేదిక‌గా మారింది. రాజ‌ధాని అమ‌రావ‌తిలో ఈ నిర్ణ‌యానికి వ్య‌తిరేకంగా ఆందోళ‌న‌లు జ‌రుగుతున్నాయి. మ‌రోవైపు ఉత్త‌రాంధ్ర‌, రాయ‌ల‌సీమ‌ల్లో స్వాగ‌త ప్ర‌క‌ట‌న‌లు కొన‌సాగుతున్నాయి. అయితే, తాజాగా ఆందోళ‌న‌ల‌కు మ‌ద్ద‌తుగా టీడీపీ యువ‌నేత నారా లోకేష్ చ‌ర్య‌కు, వైసీపీ నేత ఫైర్‌బ్రాండ్ ఎమ్మెల్యే ఆర్కే రోజా తీరుకు మ‌ధ్య ఊహించ‌ని పోలిక తెర‌మీద‌కు వ‌చ్చింది.

 

ఆంధ్రప్రదేశ్‌కుఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ మంగళగిరి అఖిలపక్ష కార్యచరణ కమిటీ నాన్‌ పొలిటికల్‌ జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం మంగళగిరి పట్టణంలో బైక్‌ ర్యాలీ నిర్వహించారు. పాత మంగళగిరి సీతారామ కోవెల వద్ద నుంచి బైక్‌ ర్యాలీని టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌, సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ప్రారంభించారు. స్వయంగా నారా లోకేష్‌ బుల్లెట్‌ వాహనాన్ని నడపగా నారాయణ వెనుక కూర్చొన్నారు. అయితే,ఈ ర్యాలీలో లోకేష్ హెల్మెట్ ధ‌రించ‌క‌పోవ‌డం ప్ర‌ధానంగా చ‌ర్చనీయాంశంగా మారింది. బాధ్య‌త‌గ‌ల ప్ర‌జాప్ర‌తినిధి, మంత్రిగా కూడా కొన‌సాగిన వ్య‌క్తి ఇలా నిబంధ‌న‌లు ఉల్లంఘించ‌డం ద్వారా ఎలాంటి సందేశాల‌ను ఇస్తున్నార‌నే కామెంట్లు నెటిజ‌న్ల నుంచి వ్య‌క్త‌మ‌య్యాయి.

 

అయితే, తాజాగా వైసీపీ నేత‌, న‌గ‌రి ఎమ్మెల్యే ఆర్కే రోజా మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన ప‌రిణామంతో వార్త‌ల్లో నిలిచారు. చిత్తూరు జిల్లాలో నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్యే రోజా బైక్ నడిపించారు. 31వ జాతీయ రహదారి భద్రతా వారోత్సవాలలో భాగంగా పుత్తూరులో ఎమ్మెల్యే రోజా బైక్ నడిపారు. వేగంకన్నా ప్రాణం మిన్న అంటూ వాహనదారుల్లో అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు ఎమ్మెల్యే రోజా. ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు కచ్చితంగా హెల్మెట్ ధరించాలని రోజా విజ్ఞప్తి చేశారు. లోకేష్ ర్యాలీ జ‌రిగిన మ‌రుస‌టి రోజే ఈ ర్యాలీ జ‌ర‌గ‌డం, హెల్మెట్ గురించి అవ‌గాహ‌న క‌ల్పించేలా రోజా ప్ర‌య‌త్నం చేయ‌డం చూస్తుంటే...ఇది లోకేష్‌కు ఊహించ‌ని పంచ్ వంటిదేన‌ని ప‌లువురు చ‌ర్చించుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: