తిరుమల భద్రతను అటవీశాఖ అధికారులు గాల్లో దీపంలా మార్చేస్తున్నారు. ఎస్వీ జూపార్కుకు ప్రహరిగోడ పేరుతో కొండపైకి రోడ్డు నిర్మాణం చేపడుతున్నారు. దీంతో ఎలాంటి తనిఖీలు లేకుండానే వాహనాలు రెండో ఘాట్ రోడ్డులోకి చేరుకునే అవకాశం ఉంది. దీని వల్ల భక్తులకు ముప్పువాటిల్లే ప్రమాదముంది. ఇప్పటి వరకు ఈ అంశంపై టీటీడీ భధ్రతా విభాగం స్పందించకపోవడం చర్చనీయాంశంగా మారింది. 

 

ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన పుణ్యక్షేత్రం తిరుమల. నిత్యం వేల సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివస్తుంటారు. విదేశాలు నుంచి భక్తులు రాకతో... తిరుమల పై ఉగ్రవాదుల దృష్టి పడింది. తిరుమల భద్రతను కట్టుదిట్టం చేయాలని ఇంటెలిజెన్స్ హెచ్చరికలతో అప్రమత్తమైంది టీటీడీ. ఎస్పీఎఫ్, ఆర్మ్‌డ్ రిజర్వు పోలీసులతో పాటు విజిలెన్స్ విభాగాన్ని ఏర్పాటు చేసుకుంది టీటీడీ. తిరుమల చేరుకోవడానికి ఉన్న రోడ్డు మార్గంతో పాటు..రెండు నడక మార్గాల వద్ద తనిఖీ కేంద్రాలను ఏర్పాటు చేసింది. మరోవైపు తిరుమల భధ్రతకు అక్టోపస్ బలగాలను కేటాయించింది రాష్ట్ర ప్రభుత్వం.

 

అలిపిరి వద్ద తనిఖీల కోసం పెద్ద వ్యవస్థనే  ఏర్పాటు చేసింది టీటీడీ. ఎస్పీఎఫ్ బలగాలతో భక్తులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే ఘాట్ రోడ్డులో ప్రవేశించే అవకాశం ఉంటుంది. దీంతో ప్రమాదకర వస్తువులు, అసాంఘిక శక్తులు కొండపైకి చేరుకునే అవకాశం వుండదు. తిరుమల అంతా సురక్షితంగానే ఉందని టీటీడీ అనుకుంటూ వుండగా.... భధ్రతా విభాగానికి ఝలక్ ఇచ్చింది అటవీశాఖ. తిరుపతిలో ఉన్న ఎస్వీ జూ పార్కుకి ప్రహరిగోడ నిర్మాణం పేరుతో అటవిశాఖ ఏకంగా రోడ్డునే నిర్మిస్తోంది. ఇన్ఫోసిస్ పౌండేషన్ వారి విరాళంతో ఈ నిర్మాణం చేపడుతోంది. చెర్లోపల్లి-అలిపిరి రోడ్డు మార్గంలో నుంచి నిర్మిస్తున్న ఈ రోడ్డుని.... తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే రెండో ఘాట్ రోడ్డుకు అనుసంధానం చేయాలని నిర్ణయించింది. దీంతో ఎలాంటి తనిఖీలు లేకుండానే ఘాట్ రోడ్డులోకి ఎవరైనా చేరుకునే ప్రమాదం ఉంది.

 

ప్రస్తుతం తిరుమలలో రోడ్డు నిర్మాణం చర్చనీయాశంగా మారింది. అటవిశాఖ అధికారులు భాధ్యతారాహిత్యంగా వ్యవహరించడంపై భక్తులు మండిపడుతున్నారు. తిరుమలలో చిన్నపాటి నిర్మాణం చేపట్టాలంటే నిబంధనల పేరుతో అడ్డుకట్ట వేసే అటవీశాఖ అధికారులు.. ఇప్పుడు అదే అటవీ ప్రాంతంలో పెద్ద ఎత్తున చెట్లను తొలగిస్తూ రోడ్డుని నిర్మించడం వివాదస్పదంగా మారింది. తిరుమల భధ్రత భాద్యత అటవీశాఖ మీద లేదా అంటూ ప్రశ్నిస్తున్నారు శ్రీవారి భక్తులు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: