ఎంఎల్ఏలే చివరకు చంద్రబాబునాయుడు కొంప ముంచేసేట్లున్నారు.  ఎందుకంటే మూడు రాజధానుల అంశంపై చర్చించేందుకు చంద్రబాబునాయుడు ఆదివారం టిడిఎల్పి సమావేశం ఏర్పాటు చేశారు.  సోమవారం నుండి మూడు రోజుల పాటు జరిగే అసెంబ్లీ సమావేశాల్లో రాజధాని తరలింపు, సిఆర్డీఏ చట్టం రద్దు లాంటి అనేక అంశాలున్నాయి. దాంతో  జగన్మోహన్ రెడ్డి   ప్రతిపాదించిన మూడు రాజధానుల ప్రకటన తర్వాత రాష్ట్రంలో ఎంత గందరగోళం జరుగుతోందో అందరికీ తెలిసిందే.

 

ఈ గందరగోళానికి ముగింపు పలికేందుకే జగన్ ప్రత్యేకంగా ఈరోజు నుండి మూడు రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని అనుకున్నారు. దాంతో అసెంబ్లీలో  అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు చంద్రబాబు కూడా టిడిఎల్పీ సమావేశం ఏర్పాటు చేశారు. అంటే ఈ సమావేశం ఎంతటి కీలకమైందో అందరికీ అర్ధమవుతోంది.

 

ఇటువంటి  సమావేశానికి ఏకంగా ఏడుగురు ఎంఎల్ఏలు గైర్హాజరవ్వటం సంచలనంగా మారింది. చంద్రబాబుపై తిరుగుబాటు చేసిన ఇద్దరు ఎంఎల్ఏలు వల్లభనేని వంశీ, మద్దాలి గిరి రారని అందరికీ తెలుసు. అయినా మిగిలిన ఎంఎల్ఏలతో పాటు వాళ్ళకు కూడా సమాచారం ఇచ్చారు. సరే వీళ్ళిద్దరిని తీసేస్తే విశాఖపట్నం జిల్లాలోని గంటా శ్రీనివాసరావు, వాసుపల్లి గణేష్, అశోక్  తో పాటు గుంటూరు జిల్లాలోని రేపల్లె ఎంఎల్ఏ అనగాని సత్యప్రసాద్, తూర్పుగోదావరి జిల్లాలోని ఆదిరెడ్డి భవాని కూడా అడ్రస్ లేరు. అలాగే 26 మంది ఎంఎల్సీల్లో 12 మంది అడ్రస్ లేకపోవటంతో టిడిపిలో ఏం జరుగుతోందో ఎవరికీ అర్ధం కావటం లేదు.

 

ఏవో వ్యక్తిగత పనులున్నాయని చెప్పి ముందుగానే చంద్రబాబు దగ్గర పర్మిషన్ తీసుకున్నారని ఐదుగురు ఎంఎల్ఏల గైర్హాజరుపై పార్టీ నేతలు ఏదో సర్దుబాటు చేస్తున్నారు లేండి. నిజానికి గంటా, వాసుపల్లి, అశోక్ ఇప్పటికే జగన్ ప్రతిపాదనకు జై కొట్టిన విషయం తెలిసిందే.    రాజమండ్రి ఎంఎల్ఏ  భవానిది శ్రీకాకుళం జిల్లా. దివంగత నేత కింజరాపు యర్రన్నాయుడు కూతురే భవాని. జిల్లాలో మెజారిటి నేతలు కూడా ఇప్పటికే విశాఖపట్నం రాజధానిగా జై కొట్టారు.

 

ఇట్లా ఎవరి కారణాలతో వాళ్ళు ఓ ఏడుగురు ఎంఎల్ఏలు ఇప్పటికే జగన్ ప్రతిపాదనకు సానుకూలంగా ప్రకటన చేసేశారు. దాంతో  అసెంబ్లీలో తమ ఎంఎల్ఏలే తన కొంప ముంచేస్తారా ? అన్న టెన్షన్ చంద్రబాబులో బాగా పెరిగిపోతోంది. అసెంబ్లీలో ఓటింగ్ జరిగితే కానీ ఏమవుతుందో తెలీదు.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: