ఏపీలో వైసీపీ భారీ విజయం తరువాత టీడీపీలో కొంత నైరాశ్యం నెలకొంది. ఇంత ఘోరంగా పార్టీ ఓటమి పాలవుతుందని ఊహించలేకపోయిన టీడీపీ నేతలు.. ఇత‌ర పార్టీల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇప్ప‌టికే కొంద‌రు నాయ‌కులు చంద్ర‌బాబుకు షాక్ ఇస్తూ.. టీడీపీని వీడ‌గా.. మ‌రికొంద‌రు అదే బాట ప‌ట్ట‌డానికి రెడీ అవుతున్న‌ట్టు తెలుస్తోంది. ఇక ప్ర‌స్తుతం రాయలసీమకు చెందిన టీడీపీ సీనియర్ నాయకురాలు పరిటాల సునీత, ఆమె కుమారుడు పరిటాల శ్రీరామ్ టీడీపీనీ వీడడానికి రెడీ అయ్యారు అంటూ జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే దీనిని నిజం చేసేలా కొన్ని పరిణామాలు చోటు చేసుకుంటుండడం ఈ అనుమానాలకు మ‌రింత బలం చేకూరుస్తోంది.

 

తాజాగా అనంతపురం జిల్లాలో పర్యటించిన చంద్రబాబు రోడ్ షో, బహిరంగ సభ, నిరసన కార్యక్రమాల్లో పరిటాల సునీత, ఆమె కుమారుడు లేకపోవడం, రాప్తాడులోనూ టీడీపీ సందడి లేకపోవడంతో ఆమె టీడీపీని వీడడం ఖాయమన్న ప్రచారం ఊపందుకుంది. అయితే చంద్రబాబు పర్యటనలో పరిటాల సునీత పాల్గొనకపోవడం, అనారోగ్యమే కారణమని టీడీపీ నాయకులు పైకి చెబుతున్నా, ఆమెకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవని అంటున్నారు కోంద‌రు. మ‌రోవైపు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేని ఆమె కుమారుడు పరిటాల శ్రీరామ్ మ‌రెందుకు సమావేశానికి దూరంగా ఉన్నారన్నది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

 

కాగా, పార్టీ ఆవిర్భావం నుంచి అనంతపురం జిల్లాలో పరిటాల కుటుంబం టీడీపీకి కంచుకోటగా ఉంటూ వస్తోంది. పరిటాల రవి ఎన్టీఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా ఉంటూ వచ్చారు. 2005లో పరిటాల రవి హత్య అనంతరం రాజకీయాల్లోకి వచ్చిన సునీత... అప్పటి నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధిస్తూ వచ్చారు. అయితే ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నుంచి పరిటాల ఫ్యామిలీ రాజకీయాలకు దూరంగా ఉంటుంది. ప్రజల్లోకి కూడా వెళ్లడం లేదు. దీంతో చంద్ర‌బాబు ఎన్నికల తర్వాత చంద్రబాబు ధర్మవరం అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ చార్జిగా పరిటాల శ్రీరామ్ కు బాధ్యతలు ఇచ్చారు. సునీతకు రాప్తాడు నియోజకవర్గం ఉంది. 

 

చంద్ర‌బాబు ఇంత ప్రేయార్టి ఇచ్చిన‌ప్ప‌టికీ.. వీరిద్ద‌రూ బీజేపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారని ప్రచారం జరుగుతోంది. పరిటాల ఫ్యామిలీతో బీజేపీ ముఖ్యనేత రాంమాధవ్ చర్చలు కూడా జరిపారని సమాచారం. అయితే ఆ పార్టీలో చేరడానికి షరతులు, నిబంధనలు పెట్టారని.. వాటి గురించే అధిష్టానంతో చర్చిస్తున్నట్టు ఆమె సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఏదేమైనా ప్ర‌స్తుతం ప‌రిటాల ఫ్యామిలీ టీడీపీలో కొన‌సాగుతుందా.. లేదా.. అన్న ఆస‌క్తిక‌రంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: