నిన్న రాత్రి అసెంబ్లీ వేదికగా మాట్లాడిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాజధాని అమరావతి పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నుంచి తొలగిస్తామని విపక్షాలు ప్రచారం చేస్తుండడం పూర్తిగా అవాస్తవం అని జగన్మోహన్ రెడ్డి తెలిపారు. తానెప్పుడూ రాజధాని అమరావతి మారుస్తామని  చెప్పలేదని... టిడిపి పార్టీ కావాలని తప్పుడు ప్రచారం చేసి ప్రజలను రెచ్చగొడుతుంది  అంటూ జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు. అమరావతి రాజధాని గానే ఉంటుందని అమరావతి తో పాటు మరో రెండు రాజధానులు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు పెట్టించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామంటూ సభలో వెల్లడించారు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. శివరామకృష్ణన్ కమిటీ సహా పలు కమిటీలు ఇచ్చిన నివేదికల వీడియోలను ముఖ్యమంత్రి జగన్ అసెంబ్లీ లో చూపించారు. 

 

 

 అమరావతి  రాజధాని గా ఉండడం తనకి ఇష్టం లేదు అంటూ టీడీపీ చేస్తున్న ప్రచారాన్ని అసెంబ్లీ వేదికగా తిప్పికొట్టిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి... అమరావతి అంటే తనకు ఎంతో ఇష్టమని... అందుకే అమరావతిలో తాను ఇల్లు కట్టుకున్నాము అంటూ చెప్పుకొచ్చారు. అమరావతి అంటే అంత ప్రేమ ఉన్న చంద్రబాబుకు మాత్రం ఇంతవరకు అమరావతిలో సొంత ఇల్లు లేదు అని గుర్తు చేశారు. ఒకవేళ తనకు అమరావతి రాజధాని గా ఉండడం ఇష్టం లేకపోతే ఇక్కడ అసెంబ్లీ సమావేశాలు ఎందుకు పెడతాను అంటూ ప్రశ్నించారు. గతంలో చంద్రబాబు గుంటూరు విజయవాడల మధ్య అమరావతి పేరుతో గ్రాఫిక్స్ చూపించిన విధంగా కాకుండా భవిష్యత్తులో ఈ రెండు నగరాల మధ్య అమరావతిని   ఓ మహా నగరంగా అభివృద్ధి చేస్తాం అంటూ తెలిపారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. 

 

 

 

 ఇక రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చిన ఏ ఒక్క రైతుకు కూడా అన్యాయం జరగకూడదని... గత ప్రభుత్వం ఇస్తామన్న పరిహారం కంటే అధిక పరిహారం ఇస్తామని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం సంక్షేమ పథకాలతో తెలంగాణ ప్రజలందరికీ దగ్గర అవుతుంటే చంద్రబాబు చూసి ఓర్వలేక అధికార పార్టీపై అనవసర తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వం చేసిన తప్పులనే తమ ప్రభుత్వం సరిదిద్దుతుందని... భవిష్యత్తులో ఎలాంటి ఉద్యమం కూడా రాకుండా పాలన వికేంద్రీకరణ దిశగా తమ ప్రభుత్వం దృష్టి సారించి రాజధానులు నిర్మిస్తోంది అంటూ పేర్కొన్నారు. శివరామకృష్ణన్ కమిటీ సహా అన్ని కమిటీలు ఇచ్చిన నివేదిక ఆధారంగానే ప్రభుత్వం ముందుకు సాగుతుందని అసెంబ్లీ వేదికగా తెలిపారు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి.

మరింత సమాచారం తెలుసుకోండి: