నెల్లూరు వైద్య కళాశాల ఏర్పడి ఐదేళ్లు కావొస్తున్నా ఇప్పటికీ పూర్తిస్థాయిలో అధ్యాపకులు లేరు. విద్యార్థుల బ్యాచ్‌లు పెరుగుతున్నాయి. మెడికల్ సీట్లు పెరుగుతున్నాయి.. కానీ అధ్యాపకుల కొరత మాత్రం వెంటాడుతూనే ఉంది. తాత్కాలిక నియామకాలకు ఎంసీఐ ఆదేశాలు ఇచ్చినా.. ఇప్పటికీ ఆ ప్రక్రియ పూర్తి కాకపోవడంతో మెడికోల భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారింది. 

 

నెల్లూరులోని దర్గామిట్టలో ఐదేళ్ల క్రితం ఏసి సుబ్బారెడ్డి ప్రభుత్వ మెడికల్ కళాశాలను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ప్రస్తుతం రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి విద్యార్థులు ఈ కళాశాలలో చేరారు. అయితే ఇక్కడ అధ్యాపకుల కొరత విద్యార్థులను వేధిస్తోంది. ప్రధాన సబ్జెక్టులకు ప్రొఫెసర్లు లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత నాలుగేళ్లలో కళాశాలలో ప్రతి ఏటా 150 మంది చేరగా.. ఈ ఏడాది సీట్లు పెరగడంతో 175మంది విద్యార్థులు ఎం.బి.బి.ఎస్ మొదటి సంవత్సరంలో అడ్మిషన్‌ తీసుకున్నారు. అయితే విద్యార్థుల సంఖ్య పెరుగుతున్నా బోధకులు నియామకం మాత్రం జరగడం లేదు.

 

మెడికల్‌ కాలేజీలో ప్రొఫెసర్, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, సీనియర్ రెసిడెంట్‌లు కలిపి మొత్తం 296 మందికి.. ప్రస్తుతం 179 మంది మాత్రమే ఉన్నారు. 43 మంది ప్రొఫెసర్లకు 23 మంది మాత్రమే ఉన్నారు. మరో 20పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అసోసియేట్  ప్రొఫెసర్ల కొరత 13కి చేరింది. 20 అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. సీనియర్ రెసిడెంట్స్  99కి గాను 35 మంది పనిచేస్తున్నారు.

 

కళాశాలలో అధ్యాపకుల కొరతతో పాటు అనేక సమస్యలు ఉన్నాయని విద్యార్థులు చెబుతున్నారు. అయితే సమస్యల గురించి ప్రస్తావిస్తే భవిష్యత్తులో తమకు ఇబ్బందులు తలెత్తుతాయని వాపోయారు. యాజమాన్యాన్ని ప్రశ్నించలేక  తప్పని పరిస్థితుల్లో చదువు కొనసాగిస్తున్నామంటున్నారు మెడికోలు. 

 

మరోవైపు అధ్యాపకుల కొరత తీర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రాధాకృష్ణ రాజు. ఈ సమస్యను రాష్ట్ర వైద్యశాఖ మంత్రికి విన్నవించామని తెలిపారు. అధ్యాపకుల నియామకాలకు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కసరత్తు చేస్తుందన్నారు ప్రిన్సిపాల్‌. బోధనా సిబ్బంది కొరత తీర్చేందుకు తాత్కాలిక అధ్యాపకులను నియమించుకోవాలని ఇటీవల జాతీయ వైద్య మండలి సూచించింది. దీని కోసం డైరెక్టర్ ఆఫ్ మెడికల్ హెల్త్ కసరత్తు చేయాల్సి ఉంది. మరోవైపు అధ్యాపకుల నియామకాలను మే నెలలో పూర్తి చేస్తామని ఇటీవల జరిపిన సమీక్షలో హామీ ఇచ్చారు మంత్రి ఆళ్ల నాని. అయితే ఇప్పటికే ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉండటంతో ఈ నియామకాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: