మీ జోక్యం అవసరం లేదని భారత్ పదే పదే చెబుతున్నా...అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వైఖరి మాత్రం మారడం లేదు.. కాశ్మీర్‌పై మధ్యవర్తిత్వానికి రెడీ అంటూ మరోసారి ప్రకటించారు. వరల్డ్ ఎకనమిక్ ఫోరం వేదికపై పాకిస్థాన్ పీఎం ఇమ్రాన్‌తో భేటీ అయిన ట్రంప్...కాశ్మీర్ విషయంలో తాము ఎంత చేయగలమో అంత చేస్తామన్నారు.

 

కాశ్మీర్ వివాదం ద్వైపాక్షిక అంశమని భారత్ ఎప్పటి నుంచో చెబుతూ ఉంది. జాతీయ అంతర్జాతీయ వేదికలపై ఇదే అంశాన్ని అనేక సార్లు ప్రస్తావించింది. కాశ్మీర్ విషయంలో మరో దేశం జోక్యాన్ని సహించబోమని  తేల్చి చెబుతూనే ఉంది. అయితే అమెరికా మాత్రం కాశ్మీర్‌లో వేలు పెట్టేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఈ విషయంలో డొనాల్డ్ ట్రంప్ పూటకో మాట మాట్లాడుతున్నాయి. కాశ్మీర్ వివాదాన్ని భారత్ పాకిస్థాన్ సామరస్య పూర్వకంగా పరిష్కరించుకోవాలని సూచిస్తూనే అవసరమైతే తాను మధ్యవర్తిగా ఉండేందుకు సిద్ధమంటున్నారు.

 

స్విడ్జర్లాండ్ దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరం వేదికగా పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌తో భేటీ అయ్యారు ట్రంప్. భారత్ పాకిస్థాన్ వ్యవహారాలు చర్చకు వచ్చాయి..  రెండు దేశాల వ్యవహారాలను చాలా దగ్గర నుంచి పరిశీలిస్తున్నామన్న ట్రంప్ అవసరమైతే  సమస్య పరిష్కారానికి తన వంతు సాయం చేస్తానన్నారు.

 

ట్రంప్ ఇలాంటి ప్రకటన చేయడం ఇది మొదటిసారి కాదు. గతేడాది ఆగస్టు నుంచి ఇలాంటి ప్రతిపాదన రావడం ఇది నాలుగో సారి. మధ్యవర్తిత్వం ప్రకటనపై ట్రంప్ మాట మీద నిలబడతారా అంటే....అదీ లేదు... భారత్ వ్యతిరేకించిన ప్రతిసారీ కాశ్మీర్ వివాదాన్ని ద్వైపాక్షికంగానే పరిష్కరించుకోవాలంటూ వైట్ హౌస్ ప్రకటన విడుదల చేస్తూ ఉంటుంది.  వివాదాస్పద నిర్ణయాలతో దూకుడుగా వ్యవహరించే ట్రంప్... కాశ్మీర్ వ్యవహారంలో తన పాత్ర కూడా ఉండాలని కోరుకుంటున్నారు. అయితే అందుకు భారత్ సిద్ధంగా లేదు. కాశ్మీర్ వివాదంలో ట్రంప్ జోక్యం అవసరమా అనే విమర్శలు వస్తున్నాయి. సున్నితమైన అంశాన్ని భారత్ సున్నితంగా డీల్ చేయగా.. ఇపుడు ట్రంప్ వేలుపెడితే ఎన్ని అనర్థాలు వస్తాయోననే వాదనలు వినిపిస్తున్నాయి.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: