జనసేన అధినేత పవన్ కల్యాణ్ మ‌ళ్లీ ఢిల్లీలో అడుగుపెట్టారు. ``నాకు ఢిల్లీ నుంచి ఫోన్ వచ్చింది. ఢిల్లీకి వెళ్తున్నాను. నేను మీకు చెప్పడం లేదు.. కానీ, అద్భుతాలు జరగబోతున్నాయి. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం కూలిపోతుంది` అని  సంచలన వ్యాఖ్యలు చేసిన అనంత‌రం ఈ టూర్ జ‌ర‌గ‌డం రాజ‌కీయాల్లో చ‌ర్చ‌కు తెర‌లేపింది. ఢిల్లీలో జరిగే బీజేపీజనసేన సమన్వయ కమిటీ సమావేశంలో పవన్ కల్యాణ్ పాల్గొననున్నారని అంటున్నారు. అయితే, కేంద్రం ప‌వ‌న్ కామెంట్ల‌కు ఎంత‌మేర‌కు విలువ ఇస్తుంద‌నే చ‌ర్చ తెర‌మీద‌కు వ‌స్తోంది. అయితే, ఈ స‌మావేశం కంటే ముందే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అవ‌డం చర్చ‌కు తెర‌లేపింది.

 

అసెంబ్లీ ముట్డడిలో గాయపడ్డ అమరావతి గ్రామాల రైతులతో స‌మావేశం అమరావతి నుంచి రాజధాని కదిలేది లేదన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌... ఆ వెంట‌నే ఢిల్లీ టూర్ పెట్టుకున్నారు. శంషాబాద్ నుంచి ఢిల్లీ చేరుకున్న పవన్ కల్యాణ్ ముందుగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అయ్యారు. పవన్‌తో పాటు నిర్మలా సీతారామన్ ను కలిసిన వారిలో జీవీఎల్ నరసింహారావు, నాదెండ్ల మనోహర్ ఉన్నారు. మూడు రాజధానుల వ్యవహారంపై చర్చించనున్నారని స‌మాచారం. ప్రధాని నరేంద్ర మోడీ, జేపీ నడ్డాతో పవన్ సమావేశమయ్యే అవకాశముందని అంటున్నారు. ఈ స‌మావేశంలో వైసీపీ ప్ర‌భుత్వం నిర్ణ‌యాలు, మూడు రాజధానుల‌ అంశంపై బీజేపీ నేతలతో చర్చించే అవకాశముంది.

 

కాగా , ఇప్ప‌టికే జనసేనాని పవన్ కల్యాణ్ తీరుపై బీజేపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు జీవీఎల్ కీల‌క వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. బీజేపీ రాజ్యసభ్యుడు జీవీఎల్ నరసింహారావు మంగళవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ... అసలు రాజధాని అంశంలో కేంద్ర ప్రభుత్వ జోక్యమేమీ ఉండదని పవన్ గాలి తీసేశారు. రాజధాని అంశం పూర్తిగా రాష్ట్ర పరిధిలోని అంశం. కేంద్ర ప్రభుత్వ ప్రమేయం ఇందులో ఉండదని ఆయన అన్నారు. త‌ద్వారా ప‌వ‌న్  కామెంట్లు వాస్త‌వాల‌కు దూరంగా ఉన్నాయ‌నే భావ‌న‌ను వ్య‌క్తం చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: