శాసనమండలిలో తాము విజయం సాధించామని ఉత్సాహంలో ఉన్న టిడిపి నాయకుల ఆనందం కొద్ది గంటల్లోనే ఆవిరైపోయింది. మొదటి నుంచి అమరావతి ప్రాంతంలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది అంటూ వైసిపి ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలపై ల్యాండ్ పూలింగ్ కేసు నమోదు చేసుకున్న సిఐడి అధికారులు ఈ విచారణను మరింత వేగవంతం చేశారు. ముఖ్యంగా తెల్ల రేషన్ కార్డు కలిగిన 796 మంది వ్యక్తులు అమరావతి ప్రాంతంలో భూములు కొనుగోలు చేసినట్లు సిఐడి ఇప్పటికే గుర్తించింది. వీరందరూ పైన కేసులు నమోదు చేశారు. ఎకరం 3 కోట్ల చొప్పున మొత్తం 761 ఎకరాలను కొన్నారని, ఆ విధంగా మొత్తం 796 మంది తెల్ల రేషన్ కార్డు దారులు ఉన్నారని, ఈ వ్యవహారంలో సుమారు 300 కోట్ల రూపాయలు చేతులు మారినట్లు సిఐడి ప్రాథమికంగా గుర్తించింది.


 వీరు భూములు ఏ విధంగా కొనుగోలు చేశారు ? అసలు సూత్రధారులు ఎవరు ? ఇలా అనేక రకాలుగా సిఐడి కూపీ లాగుతోంది. 43 మంది తెల్ల రేషన్ కార్డుదారులు 40 ఎకరాలు కొన్నారని అలాగే తాడికొండలో 180 ఎకరాలు 185 మంది తెల్ల రేషన్ కార్డ్ కలిగిన వ్యక్తులు కొన్నారని, ఇక తుళ్లూరు 243 ఎకరాలు 238 మంది తెల్ల రేషన్ కార్డులు కొనుగోలు చేశారని, మంగళగిరిలో 148 మంది తెల్ల రేషన్ కార్డు దారులు 133 ఎకరాలు ఎకరాలు, అలాగే తాడేపల్లి లో 24 ఎకరాలను  49 మంది తెల్ల రేషన్ కార్డు దారులు కొనుగోలు చేసినట్లు సిఐడి గుర్తించింది. 2014 ఏపీ ప్రభుత్వం ముందుగా విజయవాడను రాజధానిగా ప్రకటించాలని చూసింది. కానీ అకస్మాత్తుగా అమరావతిని రాజధానిగా ప్రకటించింది. 


కానీ ఆ ప్రకటనకు ముందే తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు, కొంతమంది బినామీలు కలిసి అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీ ఎత్తున భూములు కొనుగోలు చేసిన తర్వాత అక్కడ  రాజధాని ప్రకటన వెలువడిందని, రాజధాని ప్రకటనకు ముందే ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని వైసిపి ఆరోపణలు చేస్తోంది. దీనిపై సిఐడి విచారణ కొనసాగుతుండటంతో తెలుగుదేశం పార్టీ నాయకులు ఎక్కడలేని టెన్షన్ మొదలైంది. ఇక మాజీ మంత్రులు పత్తిపాటి పుల్లారావు, నారాయణపై పెద్ద ఎత్తున ఆరోపణలు రావడంతో సీఐడీ వీరిద్దరిపైనా కేసులు నమోదు చేసినట్టు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: