జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఢిల్లీకి బయలుదేరారు. తనకు సన్నిహితుడైన నాదెండ్ల మనోహర్ ను వెంట పెట్టుకుని మరీ బయలుదేరారు లేండి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు చేయాలని రెండు పార్టీలు నిర్ణయించిన విషయం తెలిసిందే.  మరి పోరాటాలంటే రెండు పార్టీల నుండి నేతలుండాలి కదా. అందుకనే రెండు పార్టీల నేతలతో సమన్వయ కమిటిలను ఫైనల్ చేయాలని అనుకున్నారు.

 

సమన్వయ కమిటిలో జనసేన తరపున ఎవరెవరుంటారు అనే విషయాన్ని చెప్పటంతో పాటు మూడు రాజధానుల ఏర్పాటును అడ్డుకునే విషయంపై మాట్లాడటానికి కూడా పవన్ ఢిల్లీకి వెళ్ళారు. వాస్తవాన్ని గమనిస్తే సమన్వయ కమిటిలో జనసేన తరపున పాల్గొనే నేతలంటూ ఎవరూ ఉండరు. ఎందుకంటే పార్టీలో చెప్పుకోదగ్గ నేతలెవరూ లేరని అందరికీ తెలుసు.

 

జనసేనలో ఉండేదంతా కేవలం పవన్ కోటరి మాత్రమే. ఈ కోటరి ఎవరంటే పార్టీలోనే చాలామందికి తెలీదు. మరలాంటపుడు మామూలు  జనాలకు తెలిసే ఛాన్సే లేదు. కాబట్టి సమన్వయ కమిటిలో జనసేన నేతలన్న విషయం కేవలం ఓ డ్రామా మాత్రమే.  కమిటిలో ఉండేదంతా బిజెపి నేతలే అని అందరికీ తెలుసు. అంటే రెండు వైపుల భారాన్ని కమలం పార్టీ నేతలే మోయాల్సుంటుంది. ఇప్పటికే బిజెపితో పొత్తు పెట్టుకుని పవన్ పార్టీ నిర్వహణ భారాన్ని దింపేసుకున్న విషయం తెలిసిపోతోంది.

 

కమలంపార్టీతో పొత్తు పెట్టుకున్న రిలీఫ్ తోనే  ఎంచక్కా హింది సినిమా పింక్ తెలుగు రీమేక్  ’లాయర్ సాబ్’  లో పవన్ షూటింగ్ కూడా మొదలుపెట్టేశారు. ఇపుడు ఢిల్లీకి వెళ్ళటంలో ప్రధాన అజెండా ఏమిటయ్యా మూడు రాజధానుల ఏర్పాటును అడ్డుకోవటమే. మూడు రాజధానుల ఏర్పాటుపై  బిజెపి నేతల్లోనే తీవ్రస్ధాయిలో విభేదాలున్న విషయం అందరికీ తెలిసిందే. మరి పవన్ మాట చెల్లుబాటు అవుతుందా ?  ఛాన్సే లేదని చెప్పచ్చు. ఎందుకంటే రాజధాని అంశంపై కేంద్రం జోక్యానికి అవకాశమే లేదు కాబట్టి.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: