నిర్భయ దోషుల ఉరిశిక్షకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. శిక్ష సమీపిస్తుండడంతో .. చివరి కోరికపై అధికారులు అడగ్గా.. మౌనమే వారి సమాధానమైంది. నిర్భయ దోషులను క్షమించాలంటూ ప్రముఖ న్యాయవాది ఇందిరాజైసింగ్‌ చేసిన వ్యాఖ్యలను విమర్శించిన బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌కు నిర్భయ తల్లి ఆశాదేవి కృతజ్ఞతలు చెప్పారు. 

 

నిర్భయ దోషులకు తుది సమయం సమీపిస్తోంది.నలుగురు దోషులను ఫిబ్రవరి 1న ఉరితీసేందుకు తిహార్ జైల్లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఉరిశిక్ష అమలు దగ్గరపడుతుండటంతో చివరి కోరికలు ఏమైనా ఉన్నాయా అని అధికారులు  అడగ్గా.. వారి నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. నిబంధనల ప్రకారం.. మరణశిక్ష పడిన దోషులు చివరి కోరికగా తమ కుటుంబసభ్యులను కలుసుకోవాలని అడగొచ్చు. వారి ఆస్తులను తమకిష్టమైన వారికిచ్చేలా ఏర్పాట్లు చేసుకోవచ్చు. అయితే ఈ రెండు విషయాల పై జైలు అధికారులు నిర్భయ దోషులను అడగ్గా.. వారు మౌనంగా ఉన్నారని సమాచారం.ఉరిశిక్ష అమలు మళ్లీ వాయిదా పడుతుందని దోషులు ధీమాగా ఉన్నట్లు కన్పిస్తోందని జైలు వర్గాలు చెబుతున్నాయి. 

 

నిర్భయ దోషులను క్షమించాలంటూ ప్రముఖ న్యాయవాది ఇందిరాజైసింగ్‌ చేసిన ప్రతిపాదనను.. విమర్శించిన బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌కు నిర్భయ తల్లి ఆశాదేవి కృతజ్ఞతలు చెప్పారు. అత్యాచార కేసుల్లో దోషులను బహిరంగంగా ఉరి తీయాలంటూ కంగనా చేసిన వ్యాఖ్యలకు ఆమె మద్దతు తెలిపారు. దోషులకు అనుకూలంగా మాట్లాడే మహిళలు రాక్షసులకు జన్మనిస్తారంటూ కంగనా చేసిన వ్యాఖ్యలను ఆశాదేవి సమర్థించారు. ఆమె మాట్లాడిన దాంట్లో తప్పేమి లేదని అన్నారు.


తన కూతురుకు జరిగిన అన్యాయానికి పడుతున్న బాధ ఏంటో తనకే తెలుసునని నిర్భయ తల్లి తెలిపారు. 'ఇంత దారుణమైన ఘటన జరిగినప్పుడు ఈ మానవహక్కుల కోసం పోరాడే వాళ్లు ఎటుపోయారు? మానవ హక్కుల పేరిట సమాజాన్ని మోసం చేస్తున్నారు. యువతుల పట్ల జరుగుతున్న అఘాయిత్యాలను వాళ్లు ఎగతాళి చేస్తున్నారు. మానవ హక్కుల పేరిట వ్యాపారం చేస్తూ నేరస్థులకు మద్దతుగా నిలుస్తున్నారు' అని ఆమె తీవ్రంగా మండిపడ్డారు. నిర్భయ దోషులను క్షమించమనేందుకు ఆమె ఎవరు? అని నిర్భయ తల్లి గతంలో ప్రశ్నించారు. 

 

మరోవైపు..నిర్భయ కేసులో దోషులు రకరకాల పిటిషన్లతో ఉరిశిక్ష వాయిదా పడుతుండడంతో...కేంద్రం  సుప్రీంకోర్టులో ఓ పిటిషన్‌ వేసింది. ఒక కేసులో మరణ శిక్ష పడ్డ వ్యక్తి పెట్టుకున్న క్షమాభిక్షను తిరస్కరించాక వారంలోగా డెత్‌ వారెంట్‌ జారీ చేసి ఉరి తీసేయాల్సిందేనని పిటిషన్‌లో తెలిపింది. ఈ విషయంలో తగిన మార్గదర్శకాలు ఇవ్వాలని కోరింది. ఉరి శిక్ష పడ్డ వ్యక్తికి కూడా కొన్ని హక్కులున్నాయని 2014లో శతృఘ్న చౌహాన్‌ కేసులో సుప్రీంకోర్టు ఓ తీర్పు ఇచ్చింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: