కొత్తగా పొత్తు పెట్టుకున్న మిత్రపక్షం జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు మొదటి షాక్ తగిలింది. ఫిబ్రవరి 2వ తేదీన అమరావతి నుండి విజయవాడకు నిర్వహించాలని డిసైడ్ చేసిన లాంగ్ మార్చ్ వాయిదా పడినట్లు కమలంపార్టీ నేతలు ప్రకటించారు.  బిజెపి ప్రకటనతో లాంగ్ మార్చ్ కాస్త  చివరకు రాంగ్ మార్చ్ అయిపోయేట్లే అనుమానంగా ఉంది.

 

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే  పవన్ లాంగ్ మార్చ్ ప్రోగ్రామ్ ను ప్రకటించినపుడు బిజెపి నేతలు కూడా పక్కనే ఉన్నారు. వాళ్ళేమీ ఈ మార్చ్ గురించి మాట మాత్రంగా కూడా ప్రస్తావించలేదు. విషయం ఏమిటని ఆరా తీస్తే లాంగ్ మార్చ్ ప్రోగ్రామ్ పూర్తిగా పవన్ కార్యక్రమని తెలిసింది. కొత్తగా పొత్తు పెట్టుకున్నారు కదా అందుకనే బిజెపి అగ్ర నాయకత్వానికి తన సత్తా ఏమిటో చూపించాలని పవన్ అనుకున్నారట.

 

నిజానికి లాంగ్ మార్చ్ లు నిర్వహించేంత సీన్ బిజెపికి లేదు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పిలుపిస్తేనే పట్టుమని రెండు మూడొందల మంది  కూడా ఉండరు. అలాంటిది అమరావతి నుండి విజయవాడకు లాంగ్ మార్చ్ అంటే మామూలు విషయం కాదు. అయినా పవన్ ఇంత భారీ కార్యక్రమాన్ని ఎందుకు పెట్టుకున్నారు ? అన్న విషయాన్ని బిజెపి  పెద్దల మధ్య చర్చకు వచ్చిందట.

 

జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగానే పవన్ మార్చ్ పెట్టుకున్నట్లు నిర్ధారణకు వచ్చారు. అయితే జగన్ ను గుడ్డిగా వ్యతిరేకించాల్సిన అవసరం బిజెపికి లేదు.  జగన్ ను ఇంతస్ధాయిలో వ్యతిరేకించాల్సిన అవసరం ఉంటే చంద్రబాబునాయుడుకు లేకపోతే పవన్ కే ఉంది. అందుకని వాళ్ళ  ఆధిపత్య గొడవల్లో తాము తల దూర్చాల్సిన అవసరం లేదని రాష్ట్ర నేతలు అనుకున్నారు.

 

అదే సమయంలో ఢిల్లీ పర్యటనలో భాగంగానే  రాష్ట్ర ఇన్చార్జి సునీల్ ధియోధర్ తో పవన్ మాట్లాడేసి లాంగ్ మార్చ్ ను ఏకపక్షంగా నిర్ణయించేశారట. రాష్ట్రపార్టీ నేతలతో మాట మాత్రంగా మాట్లాడకుండానే  పవన్ లాంగ్ మార్చ్ ను ఏకపక్షంగా ప్రకటించటంతో వీళ్ళకు ఒళ్ళు మండిందని సమాచారం. దాంతో ఇదే విషయాన్ని కేంద్ర నాయకత్వంతో మాట్లాడి లాంగ్ మార్చ్ ను రద్దు చేయించినట్లు సమాచారం. వాయిదా పడిందంటున్నారు కానీ మొత్తానికే రద్దయినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: