2019 ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ పవన్ కళ్యాణ్ ఆంధ్ర రాజకీయాల్లో తనదైన శైలిలో అధికార పార్టీపై తీవ్ర విమర్శలు చేస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఢిల్లీ వెళ్లి బిజెపి పెద్దలతో మంతనాలు జరిపిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్... ఏపీ బిజెపితో కలిసి నడవడానికి ముందుకు కదిలారు. ఈ నేపథ్యంలో బిజెపి జనసేన పార్టీలు కలిసి అధికార పార్టీపై పోరాటానికి ఇప్పటికే భవిష్యత్తు కార్యాచరణ కూడా సిద్ధం చేస్తున్నాయి. అంతేకాకుండా రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి జనసేన పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. జనసేన బీజేపీ పొత్తు ఆంధ్ర రాజకీయాలు ఆసక్తికరంగా మారిన  విషయం తెలిసిందే. 

 

 

 ఇకపోతే తాజాగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ హైదరాబాదులో భారతమాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మహా హారతి కార్యక్రమం లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన బిజేపి తో పొత్తు పై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశానికి సేవ చేయాలన్న సంకల్పంతోనే బిజెపి పార్టీ తో కలిసి ముందుకు సాగుతున్నాను అంటూ పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా తెలిపారు. దేశానికి సేవ చేస్తూ కర్పూరంలా కరిగిపోవాలి అనిపిస్తుంది అంటూ ఆకాంక్షించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. దేశానికి సేవ చేయడమే తన ముఖ్య లక్షణం అని తెలిపారు.

 

 

 ఈ సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ పై ప్రశంసల వర్షం కురిపించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ప్రధాని నరేంద్రమోదీ ది దృఢమైన  నాయకత్వం అని వ్యాఖ్యానించిన పవన్ కళ్యాణ్... ప్రత్యర్థి దేశాలన్నీ భీతిల్లిపోయే శక్తి ప్రధాని నరేంద్ర మోడీ సొంతం అంటూ ప్రశంసించారు. భారతదేశం మొత్తం భద్రంగా ఉంచే నాయకత్వం కేవలం బిజెపి లోనే ఉంది అంటూ వ్యాఖ్యానించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఈ కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ గవర్నర్ తమిళ్ సౌందరరాజన్ తదితరులు పాల్గొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: