కుల, ప్రాంతీయ అభిమానాలు ఉండని వారు ఎవరు ఉండరు. ఏదో ఒక సందర్భంలో కుల ప్రాంతీయ అభిమానాలు బయట పెట్టుకుంటుంటారు. ఇక రాజకీయాల్లో అయితే వేరే ఏమీ చెప్పక్కర్లేదు. కులం లేకుండా రాజకీయమే ఉండదు. రాజకీయం కోసం కులాన్ని కూడా చాలా చక్కగా వాడేసుకుంటూ ఉంటారు. ఒక నాయకుడు రాజకీయంగా ఉన్నత స్థాయికి వెళితే ఆ సామాజిక వర్గం వారు అంతా హీరోల్లా ఫీల్ అవుతూ ఉంటారు. ప్రస్తుతం ఏపీ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గా ఉండడంతో రెడ్డి సామాజిక వర్గం అంతా చాలా ఆనందంలో ఉంటున్నారు. మా రెడ్డికి సి ఎం వచ్చింది... ఇక తమదే రాజ్యం అంటూ బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు. ఇక యూత్ లో అయితే ఆ క్రేజ్ వేరే చెప్పక్కర్లేదు. రెడ్డి బోర్న్ ఫర్ రూల్ అంటు స్లొగన్స్ కూడా ఇచ్చేస్తున్నారు.


 జగన్ మాత్రం ఈ తరహా వ్యవహారాలను మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నారు. తాను అందరివాడిని, తనను ఒక కులానికి ఆపాదించు వద్దంటూ అనేక సందర్భాల్లో చెప్పుకున్నారు. రాష్ట్రంలో కుల, మత విద్వేషాలు లేకుండా అందరిని సమాన దృష్టితో చూస్తున్నానని చెబుతున్నారు. తన మంత్రివర్గంలోనూ అన్ని రకాల సామాజిక వర్గాలకు న్యాయం జరిగేలా మంత్రులను ఎంపిక చేసుకున్నారు జగన్. మొదటి నుంచి తనకు అండగా ఉంటూ వచ్చిన రెడ్డి సామాజిక వర్గం లోని కీలక నాయకులకు చాలామందికి పదవులు దక్క పోవడానికి కూడా రెడ్డి అనేది అడ్డుగోడగా నిలిచింది. 


 రెడ్లకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ ...మిగతా వారిని తక్కువ చేస్తున్నారు అనే మాట ఎక్కడా  వినిపించకుండా జగన్ అన్ని కులాలకు ప్రాధాన్యం దక్కేలా చేశారు. అయినా టిడిపి అధినేత చంద్రబాబు అండ్ కో జగన్ ప్రభుత్వం పై బురద జరుగుతూనే ఉంది. గత టిడిపి ప్రభుత్వంలో చూసుకుంటే... కమ్మ సామాజిక వర్గానికి ఇచ్చినంత ప్రాధాన్యత మిగతా ఏ కులానికి ఇవ్వలేదు అనేది బహిరంగ రహస్యం. మంత్రి పదవులు దగ్గర నుంచి కీలకమైన అధికారుల నియామకం వరకు మొత్తం 'కమ్మ' హవానే నడిచింది అనేది జగమెరిగిన సత్యం. దీని కారణంగా టీడీపీతో పాటు చంద్రబాబు కూడా చాలా విమర్శలు ఎదుర్కొన్నారు. అయినా ఆయన మాత్రం తన సామాజిక వర్గానికి న్యాయం చేసుకున్నారు.


 కానీ ఆ తప్పును చేసేందుకు జగన్ ఇష్టపడడం లేదు. కొంతమంది రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారికి కీలక పదవులు ఇవ్వాల్సిన అవసరం వచ్చినా వారి పేరున రెడ్డి అనే తోక లేకుండా జగన్ కట్ చేస్తున్నారు. ఇటీవల టీటీడీ సలహా మండలి సభ్యుడిగా శేఖర్ రెడ్డి ని తీసుకున్నారు. కానీ జీవోలో మాత్రం శేఖర్ గా పేర్కొన్నారు. అలాగే ప్రెస్ అకాడమీ చైర్మన్ గా దేవిరెడ్డి శ్రీనాథ్ అని జీవోలో పేర్కొని చివర ఉన్న రెడ్డి ని తీసేశారు. ఇలా రెడ్డి అని ఉంటే వెంటనే తీయించేస్తున్నారు.


జగన్ చర్య కారణంగా రెడ్డి సామాజిక వర్గం వారు తెగ బాధపడిపోతున్నారు. తమ వాడు సీఎం అయ్యాడు అని, ఇక అంతా తమ రాజ్యం అని గొప్పగా చెప్పుకుందాం అంటే ఇలా  కుల ప్రస్తావన లేకుండా జగన్ చేస్తున్నారని గగ్గోలు పెడుతున్నారు. అయినా జగన్ మాత్రం తోకలు కత్తిరించు కుంటూనే వస్తూ తనకు అన్ని కులాలు కావాలని, తాను అన్ని కులాల వ్యక్తిని అని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. జగన్ కు చంద్రబాబు కి ఉన్న తేడా ఇదే అంటూ మిగతా సామజిక వర్గాల వారు జగన్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: