తెలుగుదేశంపార్టీ సత్తా ఏమిటో తెలిసిపోతుంది. బుధవారం చంద్రబాబునాయుడుతో పాటు సీనియర్ నేతలు చాలామంది తెనాలికి వెళుతున్నారు.  మూడు రాజధానుల ప్రతిపాదనను నిరసస్తు గడచిన 30 రోజులుగా తెనాలిలో అఖిలపక్షం తరపున నిరాహార దీక్షలు జరుగుతున్నాయి లేండి. రెండు రోజుల క్రితమే ఈ శిబిరాన్ని పోలీసులు ఎత్తేశారు. దానికి నిరసనగా బుధవారం చంద్రబాబు తెనాలిలో పర్యటిస్తారట. తమ అధినేత ఎటూ వస్తున్నాడు కాబట్టి టిడిపి+జేఏసి అధ్వర్యంలో బహిరంగ సభ కూడా ఏర్పాటు చేయబోతున్నారు.

 

రాజధానిని అమారవతి నుండి తరలించేందుకు వీల్లేదంటూ చంద్రబాబు కొద్ది రోజులుగా ఎంత యాగీ చేస్తున్నారో అందరూ చూస్తున్నదే.  రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన గ్రామాల్లో రైతులను రెచ్చగొట్టారు. తర్వాత ఉద్యమ విరాళాల సేకరణ పేరుతో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో జోలె పట్టుకుని తిరిగారు. అంతే కానీ ఎక్కడ కూడా జగన్ నిర్ణయానికి వ్యతిరేకంగా బహిరంగసభ పెట్టలేదు.

 

ఆ ముచ్చట కూడా తెనాలి పర్యటనలో తీరిపోతుందంటున్నారు. మరి టిడిపి బహిరంగసభ పెడితే ఏమవుతుంది ? పర్యటనకు వెళ్ళిన ఊర్లలో జోలెపట్టటం లేకపోతే  రోడ్డుషోలో పాల్గొనటంతోనే జనాలందరూ జగన్ కు వ్యతిరేకంగా ఉన్నారని చంకలు గుద్దేసుకుంటున్నారు. నిజానికి రెండు వాహనాలు ట్రాఫిక్ లో రోడ్డు మధ్యలో ఆగిపోతే జనాలు ఎక్కడివాళ్ళక్కడ ఆగిపోతారు.

 

అలాంటిది చంద్రబాబు పర్యటిస్తున్నారంటే నిజంగానే ఆయా ప్రాంతాలు దద్దరిల్లిపోవాలి. కానీ అలాంటిదేమీ జరగలేదు. ఎక్కడ జోలెపట్టినా పట్టుమని మూడు నాలుగువందలు మంది కూడా లేరు. వీరిలో కూడా అత్యధికులు పార్టీ నేతలు, సెక్యురిటినే ఎక్కువ కనిపిస్తారు.

 

అంటే  చంద్రబాబు ఉద్యమంలో పాల్గొన్న మామూలు జనాలు దాదాపు లేరనే చెప్పాలి. అలాంటిది ఇపుడు బహిరంగసభ నిర్వహించబోతున్నారంటే మామూలు విషయం కాదు.  మరి జనాలను ఎలా సమీకరిస్తారో చూడాల్సిందే. అయినా జగన్ ప్రతిపాదనపై జనాల్లో సహజంగానే వ్యతిరేకత ఉంటే జనాలు ఎవరికి వాళ్ళుగా రోడ్లపైకి వస్తారు కానీ ఎవరో తెప్పించాల్సిన అవసరం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: