ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. ఫిబ్రవరి 8న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 11న ఫలితాలు వెలువడనున్నాయి. 2015 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ 67సీట్లతో క్లీన్ స్వీప్ చేసింది.  ఈసారి కూడా 2015 ఫలితాలను రిపీట్ చేసేందుకు కేజ్రీవాల్ కొత్త వ్యూహాలు రచిస్తున్నారు. అటు బీజేపీ ఢిల్లీ ఎన్నికలను మోడీ వర్సెస్‌ కేజ్రీవాల్‌ గా మార్చేసింది. 

 

ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రచారం ఉధృతంగా కొనసాగుతోంది. ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్, ఆమ్ఆద్మీపార్టీలు ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ రోడ్ షోలతో ప్రచారం ఉధృతంగా చేస్తున్నారు. ఢిల్లీలో జరుగుతున్న అభివృద్ధి పనులను చూసి ఆప్ అభ్యర్థులను గెలిపించాలని కేజ్రీవాల్ ప్రజలను కోరుతున్నారు.  ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి ఎలాగైనా చెక్ పెట్టి  అధికారంలోకి రావాలని బీజేపీ భావిస్తోంది. ఇందులో భాగంగా పకడ్బందీ వ్యూహాలను అమలు చేస్తోంది. ఆప్ ను దేశరాజధానిలో కనిపించకుండా చేయాలని భావిస్తోన్న కమలం పార్టీ 40మంది స్టార్ క్యాంపెయినర్లను రంగంలోకి దించింది. 2015నాటి అసెంబ్లీ ఎన్నికల్లో మోడీ హవా ఉన్నప్పటికీ కేవలం 3సీట్లు మాత్రమే గెల్చుకున్న బీజేపీ ఈ సారి పక్కాగా వ్యూహాలు రచిస్తోంది.

 

ఢిల్లీలో 70 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరి 8 న ఎన్నికలు జరుగనున్నాయి. ఫిబ్రవరి 11 న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. నువ్వా? నేనా? అన్నట్లు సాగుతున్న ఎన్నికల్లో గెలుపు కోసం ప్రధాన పార్టీలు తీవ్రంగా పోరాడుతున్నాయి. అధికార ఆమ్ ఆద్మీ పార్టీ ఈసారి కూడా విజయం తమదేనన్న ధీమాలో ఉంది. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఈసారి కొత్త అభ్యర్థులను రంగంలోకి దించడం కలసి వస్తుందా? రాదా? అన్న చర్చ జరుగుతోంది. దాదాపు పదిహేను మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కేజ్రీవాల్ ఈసారి టిక్కెట్లు ఇవ్వలేదు.

 

ఈ సారి ఢిల్లీ ఎన్నికలు మోదీ వర్సెస్ కేజ్రీవాల్ అన్న రీతిలో సాగుతున్నాయి. బీజేపీ కూడా ఇదే రకమైన ప్రచారం చేస్తోంది. గతంలో హర్షవర్ధన్, కిరణ్ బేడీలను తమ ముఖ్యమంత్రి అభ్యర్థులుగా ప్రకటించి దెబ్బతిన్న బీజేపీ ఈసారి ఆ తప్పు చేయలేదు. మోదీ ఇమేజ్ ను వాడుకోవాలనుకుంటోంది. ఇక అరవింద్ కేజ్రీవాల్ పార్టీ సయితం కేంద్రంలో మోడీ, ఢిల్లీలో కేజ్రీ అనే నినాదాన్ని పాపులర్ చేశారు. రాష్ట్రంలో తమ గెలుపు ఖాయమన్న ధీమాలో కేజ్రీవాల్ ఉన్నారు.

 

ఢిల్లీ వాసులకు ఇప్పటికే ప్రకటించిన ఉచిత ప్రయోజనాలు, అభివృద్ధి ప్రణాళికలు తమను గట్టెక్కిస్తాయని నమ్ముతున్నారు కేజ్రీవాల్. ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చేసి కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా తయారు చేశారు. మొహల్లా క్లినిక్‌ లు, సంచార క్లినిక్‌ లతో వైద్యాన్ని బస్తీల దగ్గరకు తీసుకెళ్లారు. మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం, విద్యుత్తు బిల్లుల్లో 200 యూనిట్ల వరకు పూర్తి రాయితీ, నీటి బిల్లులపై రాయితీ వంటి నిర్ణయాలు కేజ్రీవాల్ జనాదరణను మరింత పెంచాయి. దీంతో ఢిల్లీలో బలమైన నేతగా పాతుకుపోతున్న అరవింద్ కేజ్రీవాల్‌ ను ఢీ కొట్టే సీఎం అభ్యర్థి కోసం బీజేపీ నేతలు అన్వేషణ మొదలుపెట్టారు. అయితే, వరుస పరాజయాలు, చేదు అనుభవాలతో సతమతమవుతున్న బీజేపీ, ఢిల్లీ ఎన్నికల్లోనైనా పరువు నిలబెట్టుకోవాలని తాపత్రయపడుతోంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: