జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను కలుపుకుని తెలంగాణాలో కేసియార్ వ్యతిరేకపాలనపై పోరాటాలు చేయటానికి బిజెపి రెడి అవుతోంది. ఏపిలో బిజెపి, జనసేన కలవగానే ఏదో బ్రహ్మాండం బద్దలైపోతుందని తెలంగాణా బిజెపి నేతలు ఆనుకుంటున్నట్లున్నారు.  నిజానికి తెలుగురాష్ట్రాల్లో బిజెపికి ఎంత బలముందో జనసేనకూ అంతే ఉంది. అంటే రెండు పార్టీలకు పెద్ద సీన్ లేదని అర్ధం. ఏదో అదృష్టం కొద్ది పార్లమెంటు ఎన్నికల్లో కమలంపార్టీకి నాలుగు ఎంపి సీట్లు వచ్చాయంతే.

 

సమైక్య రాష్ట్రంలో కూడా బిజెపికి ఎంతో కొంత బలముందంటే అది తెలంగాణాలో మాత్రమే. కాకపోతే అప్పుడప్పుడు నక్షత్రాలు మెరిసినట్లుగా ఏపిలో కూడా అప్పుడెప్పుడో ఓ రెండు లోక్ సభ స్ధానాల్లో గెలిచింది లేండి.  మళ్ళీ చాలా సంవత్సరాల తర్వాత 2014లోనే రెండు ఎంపిలు గెలవటం. సరే ప్రస్తుత విషయానికి వస్తే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో  మొత్తం 294 సీట్లలోను పోటి చేసిన బిజెపి గెలుచుకుంది కేవలం ఒక్కటంటే ఒకే సీటు. అదికూడా గోషామహల్ లో రాజాసింగ్ తన వ్యక్తిగత పట్టుతో గెలిచిందే.

 

మిగిలిన నియోజకవర్గాల్లో డిపాజిట్లు తెచ్చుకోవటమే కష్టమైపోయింది. ఇక జనసేన సంగతి చూస్తే తెలంగాణాలో అసలు పోటి చేయటానికి భయపడింది. పోటి చేసిన ఏపిలో కూడా ఒక్క స్ధానంలో మాత్రమే గెలిచింది. అది కూడా రాజోలులో అభ్యర్ధి రాపాక వరప్రసాద్ వ్యక్తిగత పట్టుతోనే గెలిచారు తప్ప పార్టీ బలంతో కాదు. సరే పవన్ కు ఏదో బ్రహ్మాండమైన బలముందని అనుకుని బిజెపి పొత్తు పెట్టుకుంది. సరే మొదటి నుండి కూడా జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకిస్తున్న కారణంగా పవన్ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు.

 

అదే అదునుగా తెలంగాణాలో కూడా పవన్ తో పొత్తు పెట్టుకునేందుకు తెలంగాణా అధ్యక్షుడు లక్ష్మణ్  తెగ ఆరాటపడుతున్నారు. పవన్ ను కూడా కలుపుకుని కేసియార్ పై పోరాటాలు చేస్తారట. కేసియార్ కు వ్యతిరేకంగా మాట్లాడాలంటేనే భయపడిపోయే పవన్ ఇక పోరాటాలు కూడా చేస్తారా ? పవన్ కు అంత ధైర్యముందని బిజెపి ఎలా అనుకుందో అర్ధం కావటం లేదు. చూద్దాం ఇద్దరూ కలిసి ఏం చేస్తారో ?

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: