తిరుపతిలోని ప్రతిష్టాత్మకమైన హథీరాంజీ మఠం భూముల వ్యవహారంలో ప్రభుత్వం చాలా సీరియస్ గా దృష్టిసారించింది. గత కొంతకాలంగా ఈ మఠం భూములు ఆక్రమణలకు గురవుతున్నాయంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు రావడంతో ఈ అన్ని ఆరోపణలపైనా స్పందించిన ప్రభుత్వం సమగ్రంగా విచారణ చేయించింది. ఈ సందర్భంగా ఉప్పరపల్లి లో సుమారు 50కి పైగా అక్రమ నిర్మాణాలను జేసీబీ సహాయంతో కూల్చి వేయించారు. ముఖ్యంగా మఠం భూములను దుర్వినియోగం చేస్తున్నారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న మఠం కస్టోడియన్ మహంత్ అర్జున్ దాస్ పై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. 

 

వెంటనే ఆ బాధ్యతలను శ్రీకాళహస్తి ఆలయ ఈవోను తీసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. అయితే రెవెన్యూ శాఖ అక్రమ నిర్మాణాలపై కొరడా జులిపించడంతో వివిధ రాజకీయ పార్టీలు అధికారులపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తీసుకు వచ్చినట్లు తెలుస్తోంది. తిరుపతిలో ఈ మఠానికి వందల ఎకరాల భూములు ఉన్నాయి. అయితే ఈ భూములను తక్కువ ధరకు వస్తున్నాయని చెప్పి కొందరు పెద్ద ఎత్తున ఇక్కడ భూములను కూడా కొనుగోలు చేశారు. అది కాకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారం ఇక్కడ జోరందుకుంది. 

 

దొంగ పత్రాలతో రిజిస్ట్రేషన్ పత్రాలు సృష్టించి రిజిస్టర్ అధికారులను సైతం అక్రమార్కులు బురిడీ కొట్టించడంతో ఇక్కడ పెద్ద ఎత్తున భూముల కొనుగోళ్లు జరిగి కోట్లాది రూపాయల సొమ్ము చేతులు మారింది. ఈ  సందర్భంగా కోర్టు ఆదేశాలను సైతం  పట్టించుకోలేదు. గత ప్రభుత్వంలో ఈ వ్యవహారం జోరుగా సాగింది. ఇక్కడ పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయని తెలిసినా అప్పటి ప్రభుత్వ పెద్దలు ఇక్కడ లాలూచీ వ్యవహారాల కారణంగా ఈ వ్యవహారాలను పెద్ద ఎత్తున ప్రోత్సహించారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం దీనిపై సమగ్రంగా విచారణ చేయించి మఠం ఆస్తులను కాపాడే చర్యలకు దిగడంతో సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: