సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ జనసేన పార్టీకి ఊహించని షాక్ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. పార్టీకి గుడ్‌బై చెప్పే నిర్ణ‌యం తీసుకున్న ఆయ‌న ఈ మేరకు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ఓ లేఖ రాశారు. త‌న జీవితం ప్రజా సేవకే అంకితం అని పలుమార్లు ప్రకటించిన పవన్ కల్యాణ్ తిరిగి, సినిమాల్లో నటించడమే దీనికి ప్రధాన కారణంగా పేర్కొన్నారు. జ‌నసేన పార్టీకి ఎదురుదెబ్బ తగిలినట్టు అయ్యిందని జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ రాజీనామా గురించి ప‌లువురు విశ్లేషించ‌గాప‌వ‌న్ మాత్రం ఆస‌క్తిక‌రంగా స్పందించారు. లక్ష్మీనారాయణ భావాలను గౌరవిస్తున్నామని అన్నారు. 

 


వి.వి.లక్ష్మీనారాయణ భావాలను గౌరవిస్తున్నామ‌ని, ఆయన రాజీనామాను ఆమోదిస్తున్నామని ప‌వ‌న్ పేర్కొన్నారు. ``నాకు సిమెంట్ ఫ్యాక్టరీలు, పవర్ ప్రాజెక్టులు, గనులు, పాల ఫ్యాక్టరీలు లాంటివి ఏవీ లేవు. అధిక వేతనం పొందే ప్రభుత్వ ఉద్యోగినీ కాను. నాకు తెలిసిందల్లా సినిమా ఒక్కటే. నా మీద ఆధారపడి అనేక కుటుంబాలు జీవిస్తున్నాయి. వారి కోసం, నా కుటుంబం కోసం, పార్టీకి ఆర్థిక పుష్టి కోసం నాకు సినిమాలు చేయడం తప్పనిసరి. ఇవన్నీ లక్ష్మీనారాయణ తెలుసుకొని తన రాజీనామాలో ప్రస్తావించి ఉంటే బాగుండేది. లక్ష్మీనారాయణ పార్టీకి రాజీనామా చేసినప్పటికీ  వ్యక్తిగతంగా నాకు, జనసైనికులకు ఆయనపై ఉన్నగౌరవం ఎప్పటికీ అలాగే  ఉంటుంది. ఆయనకు శుభాభినందనలు.`` అని వ్యాఖ్యానించారు. 

 

కాగా, ప‌వ‌న్ తీరుపై సీబీఐ మాజీ జేడీ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ``పూర్తి జీవితం ప్రజాసేవకే అని, సినిమాల్లో నటించనని మీరు పూర్వం అనేక పర్యాయాలు తెలిపారు. ఇప్పుడు మళ్లీ సినిమాల్లో నటించాలని తీసుకున్న నిర్ణయం ద్వారా మీలో నిలకడైన విధి విధానాలు లేవని తెలుస్తోంది. కావున, నేను జనసేన పార్టీ నుంచి నిష్ర్కమించాలని నిర్ణయించుకున్నాను'' అనే పేర్కొన్నారు. "ఈ సందర్భంగా విశాఖపట్నం పార్లమెంట్‌ ఎన్నికల్లో నా వెంట నడిచిన ప్రతీ కార్యకర్తకి, నాకు ఓటు వేసిన ప్రతీ ఓటరుకు కృతజ్ఞతలు.. నేను వ్యక్తిగత స్థాయిలో జన సైనికులకు, కార్యకర్తలకు, వీర మహిళలకు మరియు పౌరులకు అందుబాటులో ఉంటానని తెలియజేస్తూ.. వారందరికీ మరియు మీకు, మీ కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడూ మంచి జరగాలని, భగవంతుడి కృప ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను..'' అంటూ లక్ష్మీనారాయణ లేఖ రాశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: