కరోనా వైరస్‌ తీవ్రంగా కలవర పెడుతోంది. ఇప్పటికే చైనాలో 170 మంది ప్రాణాలు బలిగొన్న ఈ ప్రాణాంతక వైరస్‌ ఇండియానూ భయపెడుతోంది. దేశంలో తొలి కరోనా కేసు కేరళలో నమోదవడంతో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. కేంద్ర ఆరోగ్యశాఖ అత్యవసర భేటీ నిర్వహించింది. రాష్ట్రాలను అలర్ట్‌ చేసింది. మరోవైపు, చైనాలో చిక్కుకుపోయిన భారతీయులను వెనక్కి తీసుకొచ్చేందుకూ చర్యలు ఉధతమయ్యాయి.

 

చైనాకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న కరోనా వైరస్‌ ప్రపంచ దేశాలనూ కలవర పెడుతోంది. చైనాలో కరోనా వైరస్‌ కారణంగా చనిపోయిన వారి సంఖ్య 170కి చేరుకుంది. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. కరోనా బాధితుల సంఖ్య ఏడువేలు దాటిపోయింది. ఇప్పుడు ఈ కరోనా కలకలం.. భారత్‌నూ భయపెడుతోంది. ఇప్పటికే కేరళలో తొలి కరోనా కేసు నమోదవడంతో అక్కడి ప్రభుత్వం అలర్టయ్యింది.

 

చైనా నుంచి కేరళ వచ్చిన వ్యక్తికి కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారించారు వైద్యులు. దీంతో కేరళ ప్రభుత్వం అప్రమత్తమైంది..! వైద్య ఆరోగ్య శాఖతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. బాధితుడికి త్రిస్సూర్‌లోని ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. కరోనా లక్షణాలు ఉన్నట్లు అనుమానిస్తున్న మరికొంతమందిని కూడా ప్రత్యేక విభాగంలో ట్రీట్‌మెంట్ ఇస్తున్నారు.

 

మరోవైపు దేశంలోకి కరోనా ప్రవేశించడంతో.. కేంద్ర ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. కరోనావైరస్‌ ప్రభావం, నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమీక్షించారు కేంద్ర హెల్త్‌ సెక్రటరీ. వివిధ రాష్ట్రాల వైద్యాధికారులతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. జనవరి 15 తర్వాత చైనా నుంచి వచ్చిన వాళ్లందర్నీ పరీక్షించడంతో పాటు వీళ్లందర్నీ 14 రోజుల పాటు ఐసోలేషన్‌లో ఉంచాలని ఆదేశించారు. చైనాకు ప్రయాణం మానుకోవాలని సూచించారు. 

 

ల్యాబ్‌ సౌకర్యాలు మెరుగుపర్చుకోవాలని రాష్ట్రాలను ఆదేశించిన కేంద్రం... సికింద్రాబాద్‌ సహా దేశంలో 12 కొత్త ల్యాబ్స్‌ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపింది. కాగా, హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో కరోనా వైరాలజీ ల్యాబ్‌ ఏర్పాటు కానుంది. త్వరలోనే కరోనావైరస్‌ పరీక్ష కిట్స్‌ రానున్నాయి.

 

ఇక చైనాకు ఉన్నత చదువుల కోసం, ఉద్యోగాల కోసం వెళ్లిన భారతీయులు వేలల్లో ఉన్నారు. వారందరినీ రక్షించేందుకు బీజింగ్‌ లోని భారత రాయబార కార్యాలయం రంగంలోకి దిగింది. వివిధ కన్సల్టెన్సీల ద్వారా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి వేల సంఖ్యలో విద్యార్థులు చైనాకు వెళ్లినట్టు తెలుస్తోంది. అక్కడ చాలామంది విద్యార్థులను హౌజ్‌ అరెస్ట్‌ చేశారని పుకార్లు వినిపించాయి. అయితే, తామంతా క్షేమంగానే ఉన్నామని, నిరంతరం పరీక్షలు నిర్వహిస్తున్నారని.. భారత రాయబార కార్యాలయం చేరుకునే ఏర్పాట్లు చేస్తున్నారని అక్కడి తెలుగు విద్యార్థులు తమవారికి సమాచారమిచ్చారు.

 

చైనాలో చిక్కుకుపోయిన భారతీయులందరినీ ఇండియా తీసుకొచ్చేందుకు విదేశాంగ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన విమానాల్లో వెళ్లాలనుకునే వాళ్లు భారత్ చేరుకున్నాక.. 14 రోజులపాటు తప్పనిసరిగా క్వారంటైన్లో ఉండాలని భారత రాయభార కార్యాలయం సూచించింది. స్వదేశానికి రావాలనుకునే భారతీయులు తమ పాస్పోర్ట్ నెంబర్, పేరు వంటి వివరాలను అందజేయాలని సూచించింది.  ఇటు దేశంలోనూ కరోనా కల్లోలంపై ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: