శుక్రవారం సాయంత్రం విజయవాడలో ఒక దారుణమైన సంఘటన జరిగి ఆ ప్రాంత ప్రజలను భయాందోళనకు గురి చేస్తుంది. పోలీసులు చెప్పిన ప్రకారం... భవానిపురం కెనరా బ్యాంక్ రోడ్డులో నివాసముంటున్న భార్యాభర్తలైన యేదుపాటి వెంకటేశ్వర్లు, పద్మావతి(55) శుక్రవారం ఉదయం తమ బంధువుల ఇంట్లో సత్యనారాయణ వ్రతానికి వెళ్లారు. మళ్లీ తిరిగి మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఇంటికి వచ్చేసారు. వెంకటేశ్వర్లు కొద్ది సమయం పాటు తన ఇంట్లో ఉండి ఆ తర్వాత పద్మావతిని ఒంటరిగా విడిచి పెట్టి పని నిమిత్తం బయటకు వెళ్లాడు. అలా బయటికి వెళ్ళిన వెంకటేశ్వర్లు... సాయంత్రం ఏడున్నర గంటలకు ఇంటికి చేరుకున్నాడు. అయితే, ఇంటి లోపల సామాను అంతా చిందరవందరగా పడి ఉండడంతో కంగారు పడిపోయిన భర్త భార్య కోసం వెతకగా.. ఆమె రక్తపుమడుగులో విగతజీవిగా కనిపించింది. దీంతో ఒక్కసారిగా నిర్ఘాంతపోయిన వెంకటేశ్వర్లు.. గుండెలు బాదుకుంటూ లబోదిబోమంటూ కన్నీరుమున్నీరయ్యాడు. తర్వాత పోలీసులకు సమాచారం అందించగా... వాళ్లు ఘటనాస్థలానికి తక్షణమే చేరుకున్నారు.


ఘటనా స్థలంలో కనిపించిన దృశ్యాలను బట్టి అది దోపిడీ దొంగల పనేనని ప్రాథమిక నిర్ధారణకు పోలీసులు వచ్చారు. పద్మావతిని మొదటిగా గొంతు కోసిన తర్వాత ఆమె మణికట్టు, పొట్టపై దారుణంగా పొడిచి హత్య చేశారని పోలీసులు చెప్పారు. బీరువాలోని దుస్తులు బయట పడేసినా.. వారికి మాత్రం నగలు దొరకలేదని కానీ శుభకార్యం కోసమని పద్మావతి ధరించిన నగలు(గాజులు, బంగారు గొలుసు) మాయమయ్యాయి. దీంతో నగలు ధరించిన పద్మావతిని ముందే గమనించి.. తరువాత ప్లాన్ ప్రకారం ఆమెను హత్య చేసి నగలు అపహరించి అక్కడినుండి ఉడాయించారని పోలీసులు భావిస్తున్నారు.


పద్మావతి మృతదేహం చుట్టూ కారంపొడి చల్లినా... ఘటనా స్థలంలోని వేలిముద్రలను పోలీసులు సేకరించారు. ఈ వేలిముద్రల ఆధారాలను బట్టి ఉత్తరప్రదేశ్ కు చెందిన పాత నేరస్తుడు నగల కోసమే ఈ పనికి ఒడిగట్టాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఆ వీధిలో సీసీ కెమెరాల దృశ్యాలను పరిశీలించి... ముగ్గురు దుండగులు ఈ ఘటనలో పాల్గొన్నట్టు పోలీసులు గుర్తించారు. ఆ ముగ్గురులోని ఒక అనుమానితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: