ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉన్నప్పటికీ 2025 నాటికి 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్య సాధన దిశగా నడక బాగానే సాగుతున్నదని పార్లమెంటు శీతాకాల సమావేశాల తొలి రోజున కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటున్నట్టుగా వచ్చిన కథనాలను విపక్షాలు తిప్పికొట్టాయి. అప్పుడున్న వృద్ధి రేటు ప్రకారం చూస్తే భారత్‌ వృద్ధి రేటు క్రమంగా క్షీణిస్తోందని విమర్శించారు.  దేశ వృద్ధి రేటు ప్రస్తుతం 5 శాతం లోపలే (4.9 శాతం) ఉందని ఆరోపించారు.   వృద్ధి రేటు క్షీణత ప్రజల సంక్షేమం మీద తీవ్ర ప్రభావం చూపుతోందని, నిరుద్యోగాన్ని, పేదరికాన్ని పెంచుతోందని విమర్శించారు. 

 

కానీ కేంద్ర బడ్జెట్‌ పార్లమెంటు ముందుకు రానున్న నేపథ్యంలో ఐఎంఎఫ్‌ (అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ ) కీలక వ్యాఖ్యలు చేసింది. గత సంవత్సరం భారత్‌ తీవ్ర ఆర్థిక మందగమన పరిస్థితులు ఎదుర్కొందని.. అయితే అది సంక్షోభంలోకి మాత్రం వెళ్లలేదని  (ఐఎంఎఫ్‌)  మేనేజింగ్‌ డైరెక్టర్‌ క్రిస్టలినా జార్జియెవా తెలిపారు. బ్యాంకింగేతర రంగంలో నెలకొన్న ఒడుదొడుకులు, జీఎస్టీ, నోట్ల రద్దు వంటి కీలక నిర్ణయాల వల్లే భారత ఆర్థిక రంగం కుదుపులకు లోనైందని అభిప్రాయడ్డారు. 2020లో 5.8శాతం, 2021లో 6.5శాతం వృద్ధి రేటు నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేశారు. 

 

భారత్‌ తీసుకున్న ఆర్థిక నిర్ణయాలు దీర్ఘకాలంలో సత్ఫలితాలు ఇచ్చే అవకాశం ఉందని క్రిస్టియానా అభిప్రాయపడడ్డారు. అయితే భారీ ఆర్థిక లోటుకు భారత్‌లో పరిస్థితులు లేవని.. నేడు ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌లో వీటిని ఎలా సర్దుబాటు చేశారన్నది గమనించాల్సి ఉందని ఆమె వెల్లడించారు. అలాగే భారత్‌ తీసుకోబోయే ఆర్థికపరమైన నిర్ణయాలు, బడ్జెట్‌పై ఐఎంఎఫ్‌ ఆశావహ దృక్పథంతోనే ఉందని చెప్పారు. కానీ, బడ్జెట్‌ ఆదాయం లక్ష్యం కంటే తక్కువగా ఉంటుండడమే ఆందోళన కలిగిస్తోందన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: