కేంద్ర బడ్జెట్​లో ప్రధాని జన ఆరోగ్య యోజనకు రూ.69 వేల కోట్లు కేటాయిస్తున్నట్టు  కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. రెండోసారి బడ్జెట్​ ప్రవేశపెట్టిన నిర్మలమ్మ ఈ సారి వైద్య రంగానికి ఎక్కువ ప్రాధాన్యమే ఇచ్చారు. 2025 నాటికి క్షయ వ్యాధి నివారణే ధ్యేయమన్నారు. 'టీబీ హారేగా.. దేశ్ జీతేగా' (టీబీ ఓడిపోతుంది.. దేశం గెలుస్తుంది) అనే కార్యక్రమాన్ని 2025 వరకు కొనసాగించనున్నట్లు వెల్లడించారు. ప్రతి జిల్లా ఆసుపత్రిలో మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేస్తామన్నారు. చౌక ధరలకే అన్ని జిల్లాల్లో జనరిక్​ మందులు లభించేలా చర్యలు తీసుకుంటామన్నారు. దేశంలోని అన్ని ప్రాంతాలను ఓడీఎఫ్‌లుగా మార్చడమే లక్ష్యంగా పని చేస్తామని ప్రకటించారు.  

 

మహిళా, శిశు సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర బడ్జెట్‌  ప్రసంగంలో నిర్మలా సీతారామన్‌ వెల్లడించారు. ముఖ్యంగా తాము తీసుకొచ్చిన బేటీ బచావో, బేటీ పఢావో అద్భుతమైన ఫలితాలనిచ్చిందన్నారు.  మహిళా,శిశు సంక్షేమానికి సంబంధించిన కార్యక్రమాలపై కేంద్ర బడ్జెట్  2020 లో రూ .28,600 కోట్లు కేటాయించాలని ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రతిపాదించారు.

 

ప్రాథమిక స్థాయిలో విద్య ప్రవేశ నమోదులో అమ్మాయిల నమోదు ఇప్పుడు అబ్బాయిల కంటే ఎక్కువగా ఉంది. బాలికలు ముందు వరుసలో ఉన్నారని, 5 శాతం ఎక్కువ ఉన్నారని తెలిపారు.  అలాగే పౌష్టికాహారం, ప్రధానంగా గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లుల ఆరోగ్యం కోసం భారీ నిధులను కేటాయించినట్టు తెలిపారు. అలాగే మహిళల వివాహ వయస్సు పెంచడానికి కేంద్రం ప్రతిపాదించింది.  ప్రస్తుతం ఉన్న 18 ఏళ్లను  పెంచాలని యోచిస్తోంది.  దీని కోసం ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తామని నిర్మలా సీతారామన్‌  ప్రకటించారు.

 

20 వేల ఆస్పత్రులను ప్రభుత్వ, ప్రైవేట్​ భాగస్వామ్యం కింద అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. , పండ్లు, కూరగాయల ఎగుమతులకు ప్రత్యేక విమానాలు అందుబాటులోకి తెస్తామని ప్రకటించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: