కేంద్రం పెట్టిన బడ్జెట్ తేలిపోయిందని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ  అన్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ ఏ వర్గాలను సంతృప్తి పరచలేదని విమర్శించారు. నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం అనంతరం రాహుల్ గాంధీ పార్లమెంట్ వెలుపల మీడియాతో మాట్లాడారు. 

 


ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఈ బడ్జెట్‌లో ఏ విషయంలో క్లారిటీ ఇవ్వలేకపోయిందని ఆయన ఆరోపించారు. పన్ను చెల్లింపు విధానాన్ని సరళతరం చేస్తామని చెప్పిన ప్రభుత్వం... రెండు మూడు ఆప్షన్లు ఇచ్చి ఈ విధానాన్ని మరింత కఠినతరం చేసిందని మండిపడ్డారు. బడ్జెట్‌లో నిరుద్యోగుల ప్రస్తావనే లేదని పెదవి విరిచారు. ఉద్యోగ కల్పన కోసం ఏం చేస్తారనే దానిపై కేంద్రం స్పష్టత ఇవ్వలేదని ఆయన విమర్శించారు. 

 


నిరుద్యోగ సమస్య దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యగా ఉందన్న ఆయన ఉద్యోగ కల్పన కోసం ఏం చేస్తారనే దానిపై కేంద్రం స్పష్టత ఇవ్వలేదని మండిపడ్డారు. దీనిపై ప్రభుత్వానికి ఓ స్పష్టమైన విధానం లేదని ఈ బడ్జెట్‌తో తెలిసిపోయిందని రాహుల్‌ గాంధీ ఎద్దేవా చేశారు.  

 


నరేంద్రమోదీ సర్కారు రెండోసారి అధికారంలోకి వచ్చాక ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నిర్మలా సీతారామన్‌ శనివారం ప్రవేశపెట్టిన రెండో బడ్జెట్‌ ఇది. 2020-21బడ్జెట్‌ ఇది.  లోక్‌సభలో రెండున్నర గంటలకుపైగా బడ్జెట్‌ ప్రసంగం చేసిన ఆర్థిక మంత్రి నిర్మల.. పలు వర్గాలకు వరాలు కురిపించారు.  గ్రామీణ, వ్యవసాయరంగాలకు పెద్ద పీట వేశారు. ఆదాయపన్ను చెల్లింపులో పలు మార్పులు తీసుకొచ్చారు. మధ్య, ఎగువతరగతి వర్గాలకు ఊరటనిచ్చేలా వ్యక్తిగత ఆదాయపన్ను రేట్లలో మార్పులు చేశారు. కాగా ఈ బడ్జెట్ పై ప్రతిపకాల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. బీజేపీ పాలత ప్రాంతాలకు లబ్ది చేకూరేలా బడ్జెట్ ను రూపకల్పన చేశారని పలు రాష్ట్రాల ఎంపీలు విమర్శిస్తున్నారు. రాష్ట్రాల వారిగా సమస్యలు విన్నవించినా.. కేంద్రం అవేవి పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: