కేంద్ర బడ్జెట్‌పై తెలుగు రాష్ట్రాలకు అన్యాయం జరిగిందంటూ వివిధ వర్గాల నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతోన్న సంగతి అందరికి తెలిసిందే. బడ్జెట్‌పై ప్రజల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అవుతోన్న నేపథ్యంలో నాయకుల కూడా కేంద్రం తీరుపై పెదవి విరుస్తున్నారు. ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన బడ్జెట్‌ సంతృప్తికరంగా లేదని తేల్చి చెప్పారు. ముఖ్యంగా లోటు బడ్జెట్‌తో ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు అంతంత మాత్రంగానే  కేటాయింపులు జరపడం అన్యాయమన్నారు. 

 

కేంద్ర బడ్జెట్ ప్రభావం రాష్ట్ర బడ్జెట్ మీద పడుతుందన్న ఆయన.. కేంద్రం నుంచి తగినంత సాయం అందనప్పుడు.. సర్దుబాట్లు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఏపీకి ప్రత్యేక కేటాయింపులు, రెవెన్యూ లోటు, రాజధానికి నిధుల కేటాయింపులు వంటి వాటి గురించి కనీసం ప్రస్తావించకపోవడం బాధాకరమన్నారు. బుందేల్ ఖండ్ తరహా ప్యాకేజీ వెనుకబడిన జిల్లాలకు ఇవ్వాలని కోరామని..దానిపై కూడా కేంద్రం ఏం చెప్పకపోవడం తీవ్ర అసంతృప్తకి గురిచేందని చెప్పారు.  ప్రత్యేక హోదా అంశాన్ని ప్రస్తావించకపోవడం ఇంకా బాధాకరమన్న ఆర్థికమంత్రి..హామీల అమలు, నవరత్నాల విషయంలో రాజీ పడేదేలేదని స్పష్టం చేశారు. 

 

కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్‌కు సహకారం కచ్చితంగా అవసరమన్న ఆయన.. దీనిపై కేంద్రానికి మళ్లీ విజ్ఞప్తి చేస్తామన్నారు. వ్యవసాయ కేటాయింపుల్లో ఏపీకి రావాల్సిన వాటాను కచ్చితంగా ఇవ్వాలని, రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలని, పోలవరం ప్రాజెక్ట్‌ త్వరితగతిన నిధులు కేటాయించాలి అని ఈ సందర్భంగా పేర్కొన్నారు. అలాగే రాష్ట్రానికి, వెనుకబడిన జిల్లాలకు నిధులు కావాలని, నిధుల కేటాయింపుల్లో మాత్రం ఏపీకి కేంద్రం మొండి చేయి చూపి, తన పక్షపాత ధోరణి చూపించింది అని వాపోయారు. 

 

ఆన్‌లైన్‌లో విద్య పై  జీఎస్టీ 18% చాలా ఎక్కువ అని అభిప్రాయపడుతూనే, కొత్త ఎయిర్ పోర్టుల నిర్మాణం చాలా మంచి శుభపరిణామమని పేర్కొన్నారు. అయితే ఆంధ్రప్రదేశ్‌లో ఎయిర్ పోర్టులను అభివృద్ధికి సరిపడ నిధులు ఇవ్వాలి అని వ్యాఖ్యానించారు. కేంద్రం నుండి రావలసిన పన్నుల వాటా రావడంలేదని మండిపడ్డారు. కేంద్రం పునరాలోచన చేసి, ఇక రాబోయే బడ్జెట్లో అయినా ఆంధ్ర రాష్ట్రానికి తగిన నిధులు కేటాయిస్తుందని, ఆ దిశగా అడుగులు వేస్తామని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: