కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ రాష్ట్రానికి సంబంధించి చాలా నిరాశాజనకంగా ఉందని, బడ్జెట్లో రాష్ట్రానికి మొండిచేయి చూపించారన్నది చాలా స్పష్టమవుతోందని వైయస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో సహా, ఏ ఇతర రాయితీలను ప్రకటించలేదని, వెనకబడిన జిల్లాలకు ఇవ్వాల్సిన సహాయాన్నీ ప్రస్తావించలేదని, చివరకు విభజన చట్టంలో చెప్పిన వాటిని కూడా అమలు చేయలేదని ఆయన ఆక్షేపించారు.

 

దేశమంతా ‘హోలిస్టిక్ డెవలప్మెంట్ ఆఫ్ ది కంట్రీ’ కాన్సెప్ట్తో పథకాలుండాలి తప్ప, పక్షపాత ధోరణితో రాష్ట్రాన్ని వివక్షతో చూడడం అభినందించే విషయం కాదని స్పష్టం చేశారు. బడ్జెట్లో ఏపీకి జరిగిన అన్యాయాన్ని వైయస్సార్సీపీ ఎంపీలందరం కలిసి కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని, రాష్ట్రానికి న్యాయం జరిగేలా ప్రయత్నం చేస్తామని విజయసాయిరెడ్డి వెల్లడించారు.  పార్లమెంటులో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం అనంతరం ఆ ఆవరణలో పార్టీ ఎంపీలతో కలిసి వైయస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఈ రోజు ప్రవేశ పెట్టిన బడ్జెట్పై మాట్లాడిన ఆయన, ఈ బడ్జెట్లో రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని ప్రస్తావించారు.

 

రాష్ట్రానికి సంబంధించి ఈ బడ్జెట్ చాలా నిరాశాజనకంగా ఉందన్న వి.విజయసాయిరెడ్డి, కేంద్ర ఆర్థిక సర్వేతో పాటు, బడ్జెట్, ఏపీకి కేటాయింపులపై మాట్లాడతానని చెప్పారు. ఈ బడ్జెట్లో కొన్ని సానుకూలం గానూ, మరి కొన్ని ప్రతికూలంగానూ ఉన్నాయని శ్రీ వి.విజయసాయిరెడ్డి అభిప్రాయపడ్డారు. బ్యాంకుల్లో డిపాజిటర్ల ఇన్సూరెన్స్ కవరేజీని (డీజీసీసీ) లక్ష రూపాయల నుంచి 5 లక్షలకు పెంచారని, దీని వల్ల చిన్న డిపాజిటర్లకు న్యాయం జరుగుతుందని చెప్పారు. ఇంకా ఈ బడ్జెట్లో ద్రవ్య లోటును 3.8 శాతంగా అంచనా వేశారని, కానీ ఎఫ్ఆర్బీఎం నిబంధనల ప్రకారం 3 శాతమే ఉండాలన్న ఆయన, ఈ విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని అన్నారు. రాష్ట్రానికి మొండిచేయి చూపించారన్నది చాలా స్పష్టమవుతోందని అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: