జనసేన పార్టీకి  జేడీ లక్ష్మి నారాయణ రాజీనామా చేయడం రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. రాజీనామా చేసిన సందర్భంగా ఆయన పవన్ పార్టీ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ తాను రాజకీయాల్లోకి వచ్చాను కాబట్టి పూర్తి సమయం కేటాయిస్తానని, సినిమాల జోలికి వెళ్లనని ప్రకటించి మోసం చేశారని, అందుకే తాను జనసేనకి దూరం అవుతున్నాను అంటూ రాజీనామా తర్వాత ఆయన వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అయితే ఆయన జనసేనకు దూరం అయిన తరువాత ఏ పార్టీ లోకి వెళ్తారు ? అసలు రాజకీయాల్లో ఉంటారా లేక సామాజిక సేవా కార్యక్రమాల్లో బిజీ అవుతారా అనే ప్రశ్నలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. అయితే ఆయన టిడిపిలో గాని బిజెపి గాని చేరే అవకాశాలు ఉన్నాయంటూ పెద్ద ఎత్తున పుకార్లు షికార్లు చేస్తున్నా దీనిపై ఆయన ఇప్పటి వరకు స్పందించలేదు.


 ఆయన సొంతంగా ఒక పార్టీని పెట్టుకుని  రాజకీయాల్లో చక్రం తిప్పాలని చూస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు జన ధ్వని, జన ధ్రువ ఈ రెండు పేర్లలో ఒక పేరుతో ఆయన పార్టీ పెట్టబోతున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఈ పేర్లు జనసేన కు దగ్గరగా ఉండేలా ఉన్నట్టుగా అనిపిస్తున్నా.. ఈ పేర్లు ఎంచుకోవడం వెనుక ఆయన వ్యూహాత్మక ఎత్తుగడలు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ పేర్లలో ఒకదాన్ని పెట్టడం ద్వారా జనసేన పార్టీకి తాము ప్రత్యామ్నాయం అని జెడి చెప్పబోతున్నట్టు అర్థం అవుతోంది. అంతే కాకుండా జనసేన పార్టీలో చేరి అసంతృప్తితో బయటకు వచ్చిన వారికి ఇది ఒక వేదికగా చేయాలని భావిస్తున్నట్టు సమాచారం.


 ఏపీలో లో రాజకీయ ప్రత్యామ్నాయం కోరుకునే వారందరికీ తమ పార్టీ ఒక మంచి వేదిక అవుతుందని జేడీ తన సన్నిహితుల దగ్గర వ్యాఖ్యానిస్తున్నారట. ముఖ్యంగా జనసేన టిడిపి, వైసిపి రాజకీయాలతో విసుగెత్తిపోయిన మేధావులు, తటస్థులు, నిజాయితీపరులు తదితరులంతా తమ పార్టీలోకి వస్తారని, వీళ్ల ద్వారా ఏపీలో బలమైన పునాదులు వేసుకోవాలని జేడీ ఆలోచనగా తెలుస్తోంది. ఈ మేరకు జనధ్వని, జన ధ్రువ ఈ రెండు పేర్ల లోఒక పేరును ఆయన రిజిస్టర్ చేసినట్టుగా సమాచారం.


 సామాజిక మార్పుకు, మధ్య, ఎగువ మధ్యతరగతి వర్గాలను దృష్టిలో పెట్టుకుని జేడీ ఇప్పుడు పార్టీ పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా తన పార్టీని జనాల్లోకి తీసుకువెళ్లి ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ తరహాలో ముందుకు తీసుకువెళ్లాలని జెడి ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. రాజకీయాల్లోకి రావాలంటే డబ్బులు అవసరం లేదని, సేవ చేయాలనే చిత్తశుద్ధి ఉంటే సరిపోతుంది అని నిరూపించే విధంగా జేడీ రాజకీయ పార్టీ నడపబోతున్నట్టు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: