మన దేశ ప్రజలు ఎప్పుడెప్పుడా అని అని ఎంతో ఆశగా ఎదురుచూపులు చూస్తున్న కేంద్ర బడ్జెట్ ని కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ ఎట్టకేలకు నేడు ప్రవేశపెట్టారు. ముందుగా పార్లమెంట్ ఆవరణలోకి ప్రవేశించిన నిర్మలకు సభికులు కరతాళ ధ్వనులతో ఆహ్వానం పలికారు. అయితే అందరూ ఎంతో ఆశగా ఎదురు చూసిన ఈ బడ్జెట్ పై చాలా వరకు నిరాసక్తత వ్యక్తం అవుతోంది. మాది ప్రజల పక్షపాత బడ్జెట్ అని చెప్పుకున్న బిజెపి పార్టీ, చాలావరకు దిగువ, మధ్యతరగతుల వారికి మొండి చేయి చూపించిందని పలువురు నాయకులు విమర్శిస్తున్నారు. కొందరు వైసిపి నాయకులు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్న ఈ బడ్జెట్ పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం పొగడ్తలు కురిపించారు. 

 

ఇది అన్నివిధాలా అందరికి ఎంతో ఆమోద యోగ్యమైన బడ్జెట్ అని చెప్పిన పవన్, మోడీ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు కట్టుబడి బడ్జెట్ ని ప్రవేశపెట్టడం జరిగిందని అన్నారు. నిర్లక్ష్యానికి గురైన వర్గాలకు అండగా బడ్జెట్‌లో కేటాయింపులున్నాయని తెలిపారు. రైతులు, యువతకు మేలు చేసేలా బడ్జెట్‌ ఉందని కొనియాడారు. ఇక ఓవైపు బిజెపిని పొగుడుతున్నట్లు మాట్లాడిన పవన్, మరోవైపు అధికారిక వైసిపి పై మాత్రం విమర్శలు గుప్పించారు. ఆంధప్రదేశ్ రాష్ట్రానికి నిధులు రప్పించడంలోనూ వైసిపి పూర్తిగా విఫలమైందన్న పవన్, ఆంధ్రకు రాజధానైన అమరావతిలో జరిగిన కూల్చివేతలు, అలానే రాష్ట్ర రాజధాని తరలింపు పై మాత్రం ఎంతో శ్రద్ధతో  వ్యాహరించిందని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. 

 

అలానే పవన్ కళ్యాణ్ తో పాటు వైసిపి ఎంపీ రఘురామ కృష్ణంరాజు కూడా బడ్జెట్ పై ప్రశంసలు కురిపించడం గమనార్హం. వ్యవసాయం, తాగు నీరు సహా పలు ప్రజాహిత సంక్షేమ కార్యక్రమానికి కేంద్రం పెద్ద పీట వేయడం ఎంతో ఆహ్వానించదగ్గ విషయం అని మాట్లాడిన రఘురామ కృష్ణంరాజు, ఆక్వా రంగానికి బడ్జెట్‌లో పెద్ద పీఠ వేశారని, తన నియోజవర్గంలో పెద్ద ఎత్తున ఆక్వా కల్చర్ ఉందని, తద్వారా తన నియోజకవర్గ ప్రజలకు మరింత మంచి చేకూరుతుందని తెలిపారు. ఇక బడ్జెట్ పై పవన్ చేసిన వ్యాఖ్యలపై కొందరు విమర్శలు చేస్తుండగా మరికొందరు మాత్రం అయన వ్యాఖ్యలను సమర్థిస్తున్నారు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: