కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్​ లో తెలంగాణకు మొండిచెయ్యి చూపిందని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రభుత్వం దేశం గర్వించేలా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేదని మండిపడ్డారు. తెలంగాణలో దాదాపు 70లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం రికార్డు సమయంలో నిర్మించిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదాతో పాటు ఇతర సహాయ సహకారాల గురించి బడ్జెట్‌లో ప్రస్తావించక పోవడం విచారకరమన్నారు. 

 

కోటి ఎకరాలకు సాగునీరు అందించే కాళేశ్వరం, పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలకు జాతీయ హోదా కోసం ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని, వాటిని పట్టించుకోకపోవడం కేంద్రం వ్యవసాయాన్ని విస్మరించడమేనని అన్నారు. జిల్లాకో పంట కాలనీకి సహకారం అందిస్తామని బడ్జెట్‌లో కేంద్రం తెలిపిందన్న ఆయన.. మన దేశంలోని ఎన్ని జిల్లాలకు, ఏఏ రాష్ట్రాలకు అన్నవివరాలు తెలియాల్సి ఉందన్నారు. పంటకాలనీలయినా, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌లయినా ఉపాధి హామీ పథకం వ్యవసాయానికి అనుసంధానం చేయాలని డిమాండ్ చేశారు. 

 

2008 నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్‌..  వ్యవసాయానికి ఉపాధిహామీ పథకాన్ని అనుసంధానం చేయాలని కేంద్రాన్ని కోరుతున్నారని,  తెలంగాణ అసెంబ్లీ ఈ మేరకు తీర్మానం చేసి కేంద్రానికి పంపినా పట్టించుకోవడం లేదని విచారం వ్యక్తం చేశారు. అయినా కేవలం పశుగ్రాసం పండించే వారికి మాత్రమే ఉపాధిహామీ అనుసంధానం చేస్తామనడం సరికాదన్నారు. కూలీల కొరత వ్యవసాయ రంగాన్ని వేధిస్తున్న ప్రస్తుత తరుణంలో కూడా కేంద్రం సానుకూలంగా స్పందంచలేదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎంతో ముందుచూపుతో ఆరేళ్లుగా తెలంగాణను ఆ దిశగా నడిపిస్తున్నారని అన్నారు. కేంద్రం సహకారం మాత్రం అంతంత మాత్రంగానే ఉందన్నారు. తాజా బడ్జెట్‌ కూడా వ్యవసాయ రంగం విషయంలో కంటి తుడుపుగాన వ్యవహరించిందని విమర్శించారు. నిర్మలా సీతారామాన్​ తెలంగాణకు అన్యాయమే చూశారని ఆరోపించారు. తెలుగింటి ఆడపడుచై.. తెలంగాణను విస్మరించడం విచారకమన్నారు. వెంటనే కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని కోరారు. వ్యవసాయం రంగానికి పెద్దపీట వేయాలన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: