సమత అత్యాచారం, హత్య కేసులో ఉరిశిక్ష పడిన దోషులు హైకోర్టుకు వెళ్లనున్నారు. నిందితులు ఘాతుకానికి పాల్పడుతున్నప్పుడు ఎవరూ చూడలేదని, తప్పు చేయకపోయినా కేవలం అనుమానంతోనే వారిని బలిపశువులు చేశారంటూ కొత్త వాదనను తెరపైకి తెస్తున్నారు దోషుల తరపు లాయర్.

 

సమత కేసులో అత్యంత వేగంగా సంచలన తీర్పు ఇచ్చింది ఫాస్ట్‌ట్రాక్ కోర్టు. ఐపీసీ 302 సెక్షన్ ప్రకారం ముగ్గురు దోషులు షేక్‌బాబు, షేక్‌ షాబుద్దీన్‌, షేక్‌ ముగ్దంలకు ఉరిశిక్ష శిక్ష విధించింది కోర్టు. అయితే కోర్టు తీర్పుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు దోషుల కుటుంబసభ్యులు. ఘాతుకం జరిగినప్పుడు ఎవరైనా చూశారా? అని కుటుంబ సభ్యులు ప్రశ్నిస్తున్నారు. ఎలాంటి తప్పులు చేయకపోయినా వారిని బలి పశువులను చేశారని, కచ్చితంగా హైకోర్టులో అప్పీలు చేస్తామంటున్నారు. 

 

అట్రాసిటీ కేసు కూడా రుజువు కావడంతో.. కోర్టు విధించిన 26 వేల రూపాయల ఫైన్‌ను కట్టారని తెలిపారు దోషుల తరపు లాయర్. కుటుంబసభ్యులు తమను ఆశ్రయించారని, తీర్పును తాము వ్యతిరేకిస్తున్నామని, అందుకే హైకోర్టుకు వెళ్తున్నట్టు తెలిపారు. 

 

అత్యాచారం, హత్య జరిగింది వాస్తవమే అయినా.. ముగ్గురు దోషులే చేశారని సాక్ష్యాలతో ప్రాసిక్యూషన్ నిరూపించలేక పోయారన్నారు లాయర్‌ రహీం. కేసులో వాదోపవాదనలు జరిగేప్పుడు తమ వాదనలను న్యాయమూర్తి పరిగణలోకి తీసుకోలేదని, జడ్జ్‌మెంట్‌లో కూడా అవి పొందుపరచలేదన్నారాయన. తీర్పును సరైన విధానంలో రాయలేదని, హైకోర్టులో దోషులకు అనుకూలంగా తీర్పు వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు నిందితుల తరపు లాయర్‌ రహీం.

 

కాగా దోషుల తరఫున హైకోర్టులో అప్పీలుకు నెల రోజుల సమయం ఉంటుంది. ఆలోపున వాళ్లు అప్పీల్ చేయాల్సి ఉంటుంది. ఇరువైపుల నుంచి ఆర్గ్యూమెంట్‌ జరిగిన తర్వాతే జడ్జ్‌మెంట్ ఇవ్వనుంది ధర్మాసనం. సమతను అత్యాచారం కేసులో నిందితులకు ఉరిశిక్ష విధిస్తూ ఫాస్ట్ ట్రాక్ కోర్టు నిర్ణయం తోసుకోవడంతో... వాళ్లు బయటపడేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. హైకోర్టు మెట్లెక్కి శిక్ష నుంచి తప్పించుకునేందుకు పోరాడుతున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: