అధికారుల నిర్లక్ష్యంతో చిత్తూరు జిల్లాలోని పశ్చిమ ప్రాంత పాడిరైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కరువు ఏర్పడిన సమయంలో రైతులు ఆర్ధికంగా చితికిపోకుండా.. ఆదుకునేది మదనపల్లెలోని విజయా డైరీ. అయితే ప్రస్తుతం ఆ బంధం సడలుతుంది. డైరీ కూడా అస్థిత్వాన్ని కోల్పోతుంది. ఫలితంగా ఆదరణ కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు రైతులు.

 

చిత్తూరు పాడి రైతులను ఆదుకునేందుకు మదనపల్లెలో విజయా డైరీని ప్రారంభించింది ప్రభుత్వం. పాల సేకరణ కోసం కేంద్రాలను కూడా ఏర్పాటు చేసి.. వాటి లాభనష్టాలను మహిళా సమాఖ్యలకు అప్పగించింది. అంతేకాక డీఆర్‌డీఏ ద్వారా 2011లో కామధేనువు, 2012లో జాయింట్‌ లైబిలిటీ గ్రూపులు, 2013లో పాల ప్రగతి కేంద్రాలు వంటి పథకాల ద్వారా 100 కోట్ల రూపాయల మేర రుణాలు పొదుపు సంఘాల మహిళలకు అందించి.. వారు పాడి ఆవులు కొనుగోలు చేసుకునేలా చేసింది ప్రభుత్వం. బీఎంసీయూలు, డెయిరీ ద్వారా 5వేలమందికి ఉపాధి లభించేది. అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో హైదరాబాద్‌ డెయిరీకి మదనపల్లె నుంచి పాల ఎగుమతి జరిగేది. అయితే, రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్‌ డెయిరీ నుంచి బిల్లుల చెల్లింపులకు బ్రేక్‌పడింది. అప్పటి నుంచి రైతులకు కష్టాలు మొదలయ్యాయి.

 

ఆ సమస్యను తీర్చేందుకు గత ప్రభుత్వం పాలను రాష్ట్రంలోనే వినియోగించే వెసులుబాటు తెచ్చింది. మదనపల్లెలో  30 కోట్లతో టెట్రాప్యాక్‌ పద్ధతిలో పాలను ప్యాకింగ్‌ చేసే యూనిట్‌ను నెలకొల్పింది. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఉన్న అంగన్‌వాడీ కేంద్రాలకు ప్యాకింగ్‌ పద్ధతిలో పాల తరలింపు కార్యక్రమం చేపట్టింది. అయితే ప్రస్తుతం అదీ మూతపడింది.

 

కొంత కాలంగా కర్ణాటక నుంచి పాలను కొనుగోలు చేసి ప్యాకింగ్‌ చేస్తున్నారు. అక్కడ పాల ధరలు పెరగడంతో అదీ చేయలేని పరిస్థితి ఏర్పడింది. పాడిరైతులకు 15రోజులకో సారి జరిగే బిల్లుల చెల్లింపులు నెలన్నరైనా జరగడం లేదు. ప్రైవేట్‌ డెయిరీల్లో నాణ్యత గల పాలు లీటరు  32 నుంచి  35  రూపాయలు పలికితే ఇక్కడి డెయిరీలో25కు మించడంలేదు. దీంతో శీతలీకరణ కేంద్రాలకు పాలు రావడం తగ్గిపోయింది. దీంతో.. పశ్చిమ ప్రాంత పాడి రైతులు ఏం చేయాలో అర్ధం కాని పరిస్ధితి ఏర్పడింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: