ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్‌ పార్టీ మేనిఫెస్టో విడుదల చేసింది. తాము అధికారంలోకి వస్తే నిరుద్యోగ భృతి కింద నెలకు రూ.5,000-7,500 వరకు అందిస్తామని.. విద్యుత్‌, నీటి వినియోగదారులకు క్యాష్‌బ్యాక్‌ స్కీమ్స్‌ అమలు చేస్తామని ప్రకటించింది. ఢిల్లీ కాంగ్రెస్‌ చీఫ్‌ సుభాష్‌ చోప్రా, పార్టీ నేతలు ఆనంద్‌ శర్మ, అజయ్‌ మాకెన్‌ ఆదివారమిక్కడ మేనిఫెస్టోను విడుదల చేశారు.

 

యువత, వృద్ధులు, చిన్నారుల సంక్షేమం, పేదలను లక్ష్యంగా చేసుకొని కాంగ్రెస్ మేనిఫెస్టోను రూపొందించారు. కాలుష్యం బారిన పడిన ఢిల్లీలో పర్యావరణాన్ని మెరుపర్చడం కోసం ఢిల్లీ ప్రభుత్వ నిధుల్లో 25 శాతం ఖర్చు పెడతామని ప్రామిస్ చేసింది. పచ్చదనాన్ని 6 శాతం నుంచి 20 శాతానికి పెంచుతామని.. ఢిల్లీని దేశంలోనే తొలి ఎలక్ట్రిక్ వెహికిల్ సిటీగా మారుస్తామని మాటిచ్చింది. మురుగు నీటిని నూరు శాతం శుద్ధి చేస్తామని తెలిపింది.

 

మహిళలకు ఏడాదికి ఓసారి ఉచితంగా వైద్యపరీక్షలు నిర్వహిస్తామని కూడా కాంగ్రెస్ మాటిచ్చింది. మహిళలతో 100 ఇందిరా క్యాంటీన్లను నడుపుతామని పేర్కొంది. 181 హెల్ప్‌లైన్ నంబర్‌ను తిరిగి అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చింది. వచ్చే ఐదేళ్లలో 10 సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్లు ఏర్పాటు చేస్తామని మేనిఫెస్టోలో పేర్కొంది. ఆటోలు, ఈ-రిక్షాలపై ఉన్న రుణాలను మాఫీ చేస్తామని హామీ ఇచ్చింది. ఆహార భద్రత చట్టం కింద ప్రస్తుతం ఇస్తోన్న బియ్యం, గోధుమలను రెట్టింపు చేస్తామని తెలిపింది.

 

'అధికారంలోకి వస్తే ప్రస్తుతం ఉన్న రూపంలో ఎన్ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌ను అమలు చేసేది లేదు' అని పేర్కొంది. సుప్రీంకోర్టులో సీఏఏను సవాలు చేస్తామని తెలిపింది. గతంలో షీలాదీక్షిత్ ముఖ్యమంత్రిగా వరుసగా మూడు సార్లు ఢిల్లీలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, గత అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలుచుకోలేక పోయింది. కాగా, ఈనెల 8న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుండగా, 11న ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: