నిజం నిప్పులాంటిది అది ఎప్పుడూ భగభగ మండుతూనే ఉంటుంది. అమరావతి లో రాజధాని భూ వ్యవహారాలు కూడా అదేవిధంగా తయారయ్యింది. ఇక్కడ జరిగిన భూ మాయలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇప్పటి వరకు ఈ ప్రాంతంలో బినామీ పేర్లతో కేవలం ఒక రాజకీయ పార్టీకి చెందిన కీలక నాయకులు బినామీ పేర్లతో భూములు భారీగా కొన్నారని, అప్పటి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చేలా మరికొందరు ముందే ఒప్పందం చేసుకుని భారీ ఎత్తున భూములు కొనుగోలు చేసినట్టుగా బయటపడుతున్నాయి. అందుకే అమరావతి నుంచి రాజధానిని తరలించడానికి వీల్లేదంటూ ఇంత మొండి పట్టుదలతో ఉన్నారనే విషయం ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయి.


 తాజాగా ఇదే విషయమై ఏపీ ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజయ్ కల్లాం నోటి నుంచి బయటకు వచ్చింది. అది కూడా ఓ బహిరంగసభలో ఆయన అమరావతి వ్యవహారాల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. సుప్రీం జడ్జీల చేతుల్లో అమరావతి భూములు ఉన్నాయని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. చంద్రబాబు సొంత గ్రామమైన నారావారి పల్లెలో జరిగిన బహిరంగ సభలో అజయ్ కల్లామ్ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే ఆయన ఆషామాషీగా ఈ వ్యాఖ్యలు చేశారు అనుకుంటే పొరపాటే. దీనికి సంబంధించిన అన్ని ఆధారాలు వైసీపీ ప్రభుత్వం సంపాదించిన తర్వాత మాత్రమే ఆయన ఈ విధంగా మాట్లాడినట్టుగా అర్థమవుతోంది. 


అమరావతి భూ కొనుగోళ్లలో టీడీపీ నాయకులే కాకుండా మీడియా అధిపతులు, అడ్వకేట్ జనరల్స్ కూడా ఉన్నారు అన్నట్టుగా సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే అజయ్ కల్లామ్ ఆరోపిస్తున్నట్లు సుప్రీం జడ్జిలు రాజధాని ప్రకటనకు ముందు ఈ భూములు కొన్నారా లేక ప్రకటించిన తర్వాత కొన్నారా అనే విషయాన్ని పక్కన పెడితే అమరావతి పరిసర ప్రాంతాల్లో భారీ ఎత్తున భూములు కొన్నారు, ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది అనే విషయాన్ని ఇప్పుడు హైలెట్ చేసేందుకు అజయ్ కల్లామ్ ఈ విధంగా వ్యాఖ్యలు చేస్తున్నట్లు తెలుస్తోంది.


 ప్రస్తుతం రాజధాని తరలింపు పై మూడు రాజధానులపై గందరగోళం నెలకొని ఉంది. ఈ సమస్య కోర్టు వరకు వెళ్లడం, శాసనమండలిలో సెలెక్ట్ కమిటీకి మూడురాజధానుల బిల్లుని పంపడం, శాసన మండలిని రద్దు చేస్తూ జగన్ తీర్మానం చేయడం ఇవన్నీ చోటుచేసుకున్నాయి. అమరావతి పరిసర ప్రాంతాల్లో బినామీ పేర్లతో భూములు కొనుగోలు చేసిన వారి మీద ఈడి, సిఐడి కూడా దృష్టిపెట్టడంతో ఈ విషయం మరింత దూరం వెళ్లేలా కనిపిస్తోంది. గతంలో పన్నీర్ సెల్వం కూడా చంద్రబాబుని కలిసిన సందర్భాన్నీజగన్ ప్రభుత్వం మర్చిపోలేదు. దీనిపైన లోతుగా అధ్యయనం చేస్తోంది. 


ఇక ఇప్పటి వరకు అమరావతిలో తాము తవ్వి తీసిన ఆధారాలు, ఈడి, సిఐడి ఎంక్వయిరీ రిపోర్టు లు అన్నిటిని ప్రధాని మోదీ, అమిత్షాల కు పంపించినట్టు గా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు అజయ్ కల్లమ్ ఈ విధంగా వ్యాఖ్యలు చేయడంతో ఈ వ్యవహారం తీవ్ర దుమారం లేపేలా కనిపిస్తోంది. ఈ విషయంలో వైసీపీ ప్రభుత్వానికి అన్ని రకాలుగా సహకారం అందించేందుకు బీజేపీ పెద్దలు సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. అదే జరిగితే టిడిపి ఆయన అనుకూల వర్గంగా ముద్రపడిన వారంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. ఈ వ్యవహారం ఎంతవరకు వెళ్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: