ఆదివాసీలు తమ గుండెల్లో గూడు కట్టి పూజిస్తున్న వీరవనితలు సమ్మక్క-సారలమ్మలు. తన జాతి కోసం నమ్ముకున్న విలువల కోసం.. ఆదివాసీల స్వయంపాలన కోసం.. ప్రాణాలను త్యాగం చేసి జనం గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. కాకతీయుల పాలనపై కత్తి దూసిన ఆదివాసీ బిడ్డలు సమ్మక్కసారక్కలు. 12వ శతాబ్దంలో కాకతీయులు రాజ్యపాలన సాగిస్తున్న సమయంలో.. వారికి సామంతులుగా ఉన్న రాజులు గిరిపుత్రులను చిత్రహింసలు పెట్టారు. అందులో భాగంగా ఆదివాసీలపై యుద్ధానికి వచ్చిన వారిని సమ్మక్కసారలమ్మలు ధైర్యంగా ఎదుర్కొన్నారు.  కష్టాన్ని రాజ్యం పేరుతో పన్నుల రూపంలో దోచుకునే తీరును ఈ ఇద్దరూ తీవ్రంగా వ్యతిరేకించారు. 

 

కాకతీయ రాజు రుద్రదేవ్ఞడు రాజ్యాన్ని ఆశించి మేడారంపై యుద్ధానికి పూనుకున్నాడు. తద్వారా జరిగిన యుద్దంలో సమ్మక్క భర్త పగడిద్దరాజు, సారలమ్మ, నాగులమ్మ గోవిందరాజులు వీరమరణం పొందారు. జంపన్న సంపెంగ వాగులో దూకి చనిపోయాడు. సమ్మక్క వీరోచిత పోరాట ధాటికి తట్టుకోలేని శత్రుష్టను వెనకనుంచి బల్లెంతో పొడిచారు. శత్రువ్ఞను హతమారుస్తూమేడారానికి తూర్పుదిశగా నీలకలగుట్టవైపు సాగుతూ సమ్మక్క అదృశ్యమైంది. ఆమె జాడ కనిపించలేదు. ఆ తరువాత చిలకలగుట్ట వద్ద పసుపు కుంకుమ భరిణెలతో ప్రత్యక్షమైందని గిరిజనుల నమ్మకం. దీంతో సమ్మక్కసారలమ్మల కుటుంబం మొత్తం యుద్ధంలో వీరమరణం పొందారు. అందుకే గిరిపుత్రులు తమ హక్కుల కోసం.. స్వయం పాలన కోసం ప్రాణత్యాగం చేసిన వారిని చిరకాలం గుర్తుంచుకున్నారు. దశాబ్దాలు గడుస్తున్నా సమ్మక్క సారలమ్మలపై ఎనలేని గౌరవాన్ని పెంచుకుంటున్నారు.  యావత్‌ ప్రపంచం  ఆశ్చర్యపోయేలా ఆదివాసీలు జాతరను నిర్వహించుకుంటున్నారు. ఆదివాసీల ప్రాకృతిక ఆరాధనకు, ఆధిపత్య ప్రతిఘటనకు ప్రతీకగా ఈ మేడారం జాతర నిలుస్తుంది. 

 

మేడారం జాతరలో ప్రధాన ఘట్టాలైన సమ్మక్క, సారలమ్మ దేవతలను గద్దెపైకి తీసుకురావడం ఓ అద్వితీయమైన అనుభూతి. సమ్మక్క, సారలమ్మ పూజారులను అధికారులు ఒప్పించి అమ్మవారి గద్దెకు తీసుకువస్తారు. ఇంటి ఆడకూతురును వివాహానంతరం అత్తవారింటికి పంపించడానికి తల్లిదండ్రులకు మనుసొప్పని విధంగానే తమ కుల దైవం సమ్మక్క, సారలమ్మలను గద్దెలపైకి తీసుకెళ్లి ప్రతిష్ఠించడానికి ముందు పూజారుల పడే బాధ కన్నీరు తెప్పిస్తుంది. ఆ సమయంలో దేవతల ఆగమనం కోసం పడిగాపులు కాసే లక్షలాది మంది భక్తులకు దర్శన భాగ్యం కల్పించేందుకు అధికారులు పూజారులను ఒప్పించి తీసుకురావాల్సిందే. గిరిజన సంప్రాదాయక వాయిద్యాలతో సమ్మక్క, సారక్కలను తీసుకొచ్చే ఆ ఘట్టం మహోద్విగ్నంగా ఉంటుంది. 

 

సమ్మక్క, సారమ్మలు కుంకుమ భరిణె రూపంలో కొలువుదీరారని గిరిజనుల నమ్మకం. ఈ కుంకుమ భరిణెలను వెదురు బుట్టల్లో భద్రంగా దాచి చిలకలగుట్ట పై ఉండే ఆలయంలో పెడతారు. చిలకలగుట్టకు నలువైపులా ఈటెలు ధరించిన గిరిజనులు కాపలాగా ఉంటారు. సారలమ్మను, సమ్మక్కను గద్దెపై ప్రతిష్ఠిస్తారు. అమ్మవార్లు గద్దెపైకి చేరగానే లక్షలాది మంది భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. తమ పిల్లాపాపలకు తలనీలాలు తీయడం, బంగారంతో (బెల్లం) తులాభారాలు ఇవ్వడం ద్వారా మొక్కులు తీర్చుకుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: