వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం పార్లమెంట్‌ను కుదిపేసింది..! సీఏఏకు వ్యతిరేకంగా కాంగ్రెస్ సహా విపక్షాలు ఆందోళన చేయడంతో ఉభయ సభలు అనేక సార్లు వాయిదా పడ్డాయి. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేతలు సభలో ఉండటంపై ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. నిరసనల్లో పాల్గొంటున్న వారిని పిట్టల్ని కాల్చినట్టు కాల్చేస్తున్నారని కాంగ్రెస్ విమర్శించింది.

 

రెండు నెలలుగా దేశాన్ని కుదిపేస్తున్న పౌరసత్వ సవరణ చట్ట ప్రకంపనలు పార్లమెంట్‌ను తాకాయి. రాష్ట్రపతి ప్రసంగం, బడ్జెట్ కూడా పూర్తవడంతో సీఏఏపై ప్రభుత్వాన్ని నిలదీసే ప్రయత్నం చేశాయి విపక్షాలు. లోక్‌సభ ప్రారంభమైన వెంటనే స్పీకర్ ప్రశ్నోత్తరాలను ప్రారంభించాయి. సీఏఏ వివాదంపై చర్చించాలంటూ విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. సీఏఏపై మాట్లాడుతుంటే తూటలు కురిపిస్తున్నారంటూ కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు.. దీనిపై వెంటనే ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

 

ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ సభలో ప్రసంగిస్తున్నప్పుడు విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. షేమ్ షేమ్ అంటూ నినాదాలు చేశాయి. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే తీర్మానాన్ని వివాదాస్పద ఎంపీ పర్వేష్ వర్మ ప్రవేశపెట్టడం కూడా వివాదానికి దారి తీసింది.  సీఏఏపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతున్నా కేంద్రం పట్టించుకోడం లేదంటూ విపక్షాలు ఆరోపించాయి.

 

జామియా మిలియా యూనివర్సిటీలో కాల్పులపై ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ లోకసభలో ప్రభుత్వాన్ని నిలదీశారు. విద్యార్థులపై కాల్పులు జరపడాన్ని ఖండించారు. దీనిపై ప్రభుత్వం వెంటనే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అటు రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి. జాతీయ పౌర పట్టిక, పౌరసత్వ చట్టం సవరణ అంశాలపై చర్చించాలంటూ విపక్ష సభ్యులు వాయిదా తీర్మానాలు ఇచ్చారు. అయితే రాజ్యసభ చైర్మన్ వాటిని తిరస్కరించారు.  గందరగోళం  మధ్యే సభ రేపటికి వాయిదా పడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: