నాయకులు అందరు అవుతారు, అందులో వేళ్లమీద లెక్కపెట్టేలా కొందరే మిగులుతారు. ఈ కాలంలో ఒక మనిషి నాయకుని అవతారం ఎత్తాడంటే, అతని పదవికాలంలో తాను కూడబెట్టుకునే ఆస్తుల విలువ చూస్తే కళ్లు తిరగడం మాత్రం ఖాయం. ఇప్పుటి రాజకీయాలు ఎలా ఉన్నాయంటే, చెప్పేటివి శ్రీరంగ నీతులు, చొచ్చేది మాత్రం దొమ్మరు గుడిసెలు అనేలా తయారు  అయ్యాయి... ఇక ఒక వ్యక్తి ప్రజా ప్రతినిధిగా, ఒక సంవత్సరం చేస్తే చాలు, అతని ఆస్తుల లెక్కలకు అమాంతం రెక్కలు వస్తుంటాయి. ఇలా ఈ మధ్యకాలంలో విపరీతంగా సంపాధించుకున్న నాయకులు మనకు తరచుగా కనిపిస్తూనే ఉన్నారు.

 

 

పదవి ఉన్నది ప్రజలకోసం కాదు మా కోసం. మేము సుఖపడటం కోసం అనే రీతిగా నాయకులు ప్రవర్తిస్తున్నారు. ఓటరు కూడా ఇలానే తయారు అయ్యారు. జేబులోనుండి పదిరూపాయల నోటు పోతే ఫీలయ్యే ఓటర్లు, ఎలక్షన్స్ సమయంలో ఇచ్చే రెండు మూడు వేయిల రూపాయలకు ఆశపడి, అవినీతి నాయకులకు పదవులు కట్టపెట్టి కోట్లకు కోట్లు దోచుకొమ్మని మరీ పదవులు కట్టబెడుతున్నారు. ఇలంటి అవినీతి రాజ్యంలో, తామరాకు మీద నీటి బొట్టులా బ్రతుకుతున్న వ్యక్తి,, సిగ్గులేని రాజకీయాలు చేసే నాయకులకు ఆదర్శంగా జీవిస్తున్న మనిషి. గుమ్మడి నర్సయ్య అని అనుకోక తప్పదు. ఎందుకంటే ఒక్క సారి ఎమ్మెల్యేగా చాన్స్ వస్తే  కార్లు, బంగ్లాలు, టూర్లు వంటి విలాసవంతమైన జీవితానికి పునాది వేసుకుంటున్న నాయకులు ఉన్న ఈ రోజుల్లో, ఏకంగా అయిదు సార్లు ఎమ్మేల్యేగా గెలవడం అంటే మాటలు కాదు.

 

 

ఇక గుమ్మడి నర్సయ్య గారు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఇల్లందు నియోజకవర్గం నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1983, 1985, 1989, 1999, 2004లో శాసనసభ్యునిగా ప్రాతినిధ్యం వహించారు. అయితే ఎమ్మెల్యేగా అన్నిసార్లు గెలుపొందినప్పటికీ ఆయనలో ఏనాడు కూడా అహంభావం కనిపించలేదు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడైనా.. ఇప్పుడైనా.. సైకిల్‌పైనే తిరుగుతారు. ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణిస్తారు. నగరానికి వచ్చినప్పుడు, జీహెచ్‌ఎంసీ ఏర్పాటు చేసిన 5 రూపాయలకే భోజనం తీసుకోవడం అదే ఆయన స్పెషాలిటీ. నిజం చెప్పాలంటే కామన్ మ్యాన్ అనే పదానికి పూర్తి అర్ధం నర్సయ్య గారు..

 

 

ఒక్క గన్ మెన్‌ను కూడా పెట్టుకోకుండా తన పదవికాలాన్ని ప్రజా సేవలో గడిపారు. ఇప్పటికి గడుపుతూనే ఉన్నారు. నేటి కాలంలో అయితే ఒక రాజకీయ నాయకుడు వస్తున్నాడంటే, రాచరిక మర్యాదలతో అధికారులు పహారా కాస్తున్నారు. ప్రజల్లో తిరిగే వాడే ప్రజా నాయకుడు అవుతాడు గాని, భయంతో చుట్టూ గోడల్లా నలుగురిని వెంటేసుకుని తిరిగే వారు, ప్రజా నాయకులు ఎలా అవుతారు. నాయకుడంటే ప్రజలకోసం చచ్చేవాడు. నాయకుడు అంటే అవినీతి కిరీటం ధరించని వాడు. నాయకుడు అంటే ప్రజల్లో నుండి పుట్టి ప్రజలకోసం తనను తాను అర్పించుకునే వాడు. కాని నేటి రాజకీయాలు వీటన్నీటికి భిన్నంగా ఉన్నాయి. ఇలాంటి కలుపు మొక్కల మధ్య నిజమైన నాయకునిగా, సామాన్యమైన మనిషిగా, సాదాసీదా జీవితం గడుపుతున్న గుమ్మడి నర్సయ్య గారు న్యాయదేవతకు దత్తపుత్రుడని చెప్పవచ్చూ.. ఇలాంటి వారిని చూసి సిగ్గుపడవలసిన, సిగ్గుతెచ్చుకోవలసిన నాయకులు ఎందరో ఉన్నారని ప్రజలు అనుకుంటున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: