తెలంగాణ కుంభ‌మేళా మేడారం జాతరలో ప్ర‌తి ఘ‌ట్టం ప్ర‌త్యేక‌మే. ఆదివాసీల ఈ పండుగ భ‌క్తులంద‌రికీ క‌న్నుల పండుగే. ఈ పండుగ‌లో అతి ముఖ్య‌మైన ఘ‌ట్టం వన దేవతలు గద్దెలపైకి రానుండడం. ఈ సంబురానికి ప్ర‌త్యేక ఏర్పాట్లు ఉంటాయి. ప్రధాన ఆలయం ముందు భాగంలో మామిడి తోరణాలతో అలంకరిస్తారు. అనంతరం డోలు వాయిద్యాలతో మైసమ్మ గుడికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం బొడ్రాయి వద్ద పూజలు చేసి...పసుపు కుంకుమలను కలిపి ఆలయం లోపలికి వచ్చే ప్రధాన రహదారి ముందు చల్లుతారు.గుమ్మానికి పైన తోరణాలు కట్టి కోడి పిల్లను వేలాడదీసి... కల్లు ఆరబోసి కోడి పిల్లను బలి ఇస్తారు. పాలు, నీళ్లు, నెయ్యి, పెరుగు, కల్లు కలిపి వెదురు బొంగు నిలిపిన దారికి అడ్డంగా పోసి అమ్మవార్లకు దిష్టి తగలకుండా చేస్తారు.


కాగా, ప్ర‌స్తుతం మేడారం సమ్మక్క-సారక్క దేవతలను దర్శించుకునేందుకు  భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. వరాల తల్లులను దర్శించుకునేందుకు  అమ్మవార్ల గద్దెల వద్ద మొక్కులు తీర్చుకుంటున్నారు.  శివసత్తుల పూనకాలతో, సకుటుంబ సపరివార సమేతంగా తల్లులను దర్శించుకున్న భక్తులు అమ్మవారికి మొక్కులు తీర్చుకుంటున్నారు.అమ్మవార్ల గద్దెలపై పసుపు, కుంకుమ, ఎత్తుబెల్లం, నూతన వస్త్రాలు, పూలు, పండ్లు సమర్పించి గిరిజన సంప్రదాయ పద్ధతుల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. అనంతరం తల్లులకు యాటపోతులను, కోళ్లను సమర్పించి గద్దెల పరిసరాల్లో వంటలు చేసుకొని విందు భోజనాలు చేస్తున్నారు.

 


తెలంగాణ కుంభమేళగా ప్రసిద్ధిగాంచిన సమ్మక్క-సారలమ్మ మేడారం జాతరకు దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయని, భక్తులకు అసౌకర్యం కలుగకుండా ప్రభుత్వం శ్రద్ధ వహించిందని జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ ఆర్‌వీ కర్ణన్‌ వెల్లడించారు. ఎస్పీ డాక్టర్‌ సంగ్రామ్‌సింగ్‌ జీ పాటిల్‌, జాతర నోడల్‌ ఆఫీసర్‌ వీపీ గౌతమ్‌తో కలిసి ఐటీడీఏ సమావేశ మందిరంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడారు. ప్రభుత్వం జాతర అభివృద్ధి పనులు, భక్తులకు కల్పించే సౌకర్యాల కోసం రూ.75 కోట్లను విడుదల చేసిందని తెలిపారు. జాతర కోసం ప్రభుత్వం కేటాయించిన నిధులతో శాశ్వత, తా త్కాలిక ప్రాతిపదికన పనులు చేపట్టినట్లు వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: