సీఏఏ నిరసన కార్యక్రమాలను మరింత దూకుడుతో ముందుకు తీసుకువెళ్లేందుకు ఎమ్‌ఐఎమ్‌ సమాయత్తం అవుతోంది. జాయింట్‌ యాక్షన్‌ కమిటితో కలిసి తిరంగా ర్యాలీ, బహిరంగ సభలను నిర్వహించిన ఎమ్‌ఐఎమ్‌ జైల్‌ భరో కార్యక్రమాన్ని చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. 

 

పౌరసత్వ నమోదు చట్టం, ఎన్‌పీఆర్‌, ఎన్‌ఆర్‌సీలకు వ్యతిరేకంగా జాయింట్‌ యాక్షన్‌ కమిటీతో కలిసి ఆందోళనా కార్యక్రమాలు చేపడుతున్న ఎమ్‌ఐఎమ్‌ స్పీడ్ పెంచేందుకు సమాయత్తం అవుతోంది. కేంద్రం అమలు చేయనున్న ఈ చట్టాల వల్ల మైనార్టీల హక్కులకు భంగం కలగటమే కాకుండా ఇవన్నీ రాజ్యాంగ విరుద్ధం అనేది ఎమ్‌ఐఎమ్‌ వాదన. మిగిలిన ముస్లిం, ప్రజా సంఘాలు కలిసి జాయింట్‌ యాక్షన్‌ కమిటీని ఇప్పటికే ఏర్పాటు చేశాయి. ఇందులో కీలక పాత్ర పోషిస్తున్న ఓవైసీ సోదరులు విభిన్న నిరసన కార్య క్రమాల ద్వారా ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. ఆంధ్ర, తెలంగాణాలోనే కాకుండా బీహార్‌, కర్ణాటక వంటి ఇతర రాష్ట్రాల్లో నిరసన సభల్లో అసదుద్దీన్‌ ఓవైసి పాల్గొంటున్నారు. హైదరాబాద్‌లో తిరంగా ర్యాలీ, నిరసన కవిత్వం, మహిళల నిరసన వంటి విభిన్న కార్యక్రమాలను ఎమ్‌ఐఎమ్‌ వెనకుండి నడిపింది.   

 

అటు కేంద్రం కూడా ఈ చట్టాల విషయంలో ముందుకే వెళ్ళే పరిస్థితులు ఉండటంతో ఓవైసీ సోదరులు కూడా నిరసన వేడిని కొనసాగించేందుకు కసరత్తు చేస్తున్నారు. కర్ణాటక, ఒరిస్సా వంటి రాష్ట్రాల్లో సీఏఏ నిరసన గళాలు వినిపించిన వారిని అక్కడి ప్రభుత్వాలు పలు కేసుల కింద అరెస్టులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా జైల్‌ భరో కార్యక్రమాన్ని చేపట్టి కేంద్రం పై ఒత్తిడి తీసుకురావాలనే వ్యూహంలో మజ్లిస్‌ పార్టీ ఉంది.   

 

మొత్తం దేశంలోని అన్ని జైళ్ళ సామర్థ్యం మూడు లక్షలు మాత్రమే. అనుమతులు లేకున్నా నిరసన కార్యక్రమాలు చేపట్టి స్వచ్ఛందంగా జైళ్ళల్లోకి వెళ్లేలే ప్రణాళిక సిద్ధం చేసుకుంటోంది. ఇదే విషయాన్ని అసదుద్దీన్‌ ఒవైసీ పరోక్షంగా వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం పై ఒత్తిడి పెంచే వ్యూహాల్లో ఇది ఒక భాగం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ప్రధానంగా ప్రజలతో సంబంధాలు ఏర్పరచుకునేందుకు, చట్టాలకు సంబంధించిన అవగాహన వారిలో కల్పించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయి అంటున్నారు. కార్యక్రమ విధి విధానాలను ఖరారు చేసే పనిలో ఉంది జాయింట్ యాక్షన్‌ కమిటీ. మరి వీరి ఆందోళనలు, ఒత్తిడి పెంచే వ్యూహాలపై కేంద్రం ఎలా స్పందిస్తుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: