అమరావతి రాజధాని పరిధిలో జరిగిన ఇన్ సైడర్ ట్రేడింగ్ పై  ఇద్దరు మాజీ మంత్రులు పొంగూరు నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావుపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడి) కేసు నమోదు చేసిందా ? ఇద్దరిపైన ఈడి కేసులు నమోదు చేసిందని  విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. అమరావతి ప్రాంతంలో జరిగిన ఇన్ సైడర్ ట్రేడింగ్ విషయంలో సుమారు 800 మందిపై సిఐడి ఇప్పటికే కేసులు నమోదు చేసిన విషయం అందరికీ తెలిసిందే.

 

సిఐడి నమోదు చేసిన కేసులన్నీ చంద్రబాబునాయుడు, లోకేష్ తో పాటు కొందరు మాజీ మంత్రులు, మాజీ ఎంఎల్ఏల బినామీలని సిఐడి అనుమానిస్తోంది. అందుకనే బినామీలపై కేసులు నమోదు చేసిన సిఐడి కేసులు మొత్తాన్ని ఈడి, ఐటి విభాగాలకు ట్రాన్స్ ఫర్ చేసింది. సిఐడి రిపోర్టు, కేసుల ఆధారంగానే ఈడి దర్యాప్తు మొదలుపెట్టినట్లు సమాచారం.

 

తెలంగాణాతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో పనిచేస్తున్న తెల్ల రేషన్ కార్డుదారుల పేర్లతో దాదాపు 4070 ఎకరాలు రిజిస్టర్ అయ్యాయి. సిఐడి చేసిన విచారణలో భూముల సొంతదారులంతా టిడిపి ప్రముఖల ఇళ్ళల్లో డ్రైవర్లుగాను, వంటవాళ్ళు, పనిమనుషులుగా పనిచేస్తున్నట్లు గుర్తించింది. నెలకు కేవలం వేల రూపాయల జీతాలకు పనిచేస్తున్న వాళ్ళంతా  లక్షల రూపాయలు పెట్టి రాజధాని గ్రామాల్లో భూములు ఎలా కొన్నారన్నది పెద్ద ప్రశ్న.

 

ఇదే విషయాలపై మరింత లోతుగా విచారణ జరిపిన సిఐడికి భూములు కొనుగోలు చేసిన వాళ్ళంతా చంద్రబాబు, లోకేష్, మాజీ మంత్రులు నారాయణ, ప్రత్తిపాటి, యనమల వియ్యంకుడు సుధాకర్ యాదవ్, పరిటాల సునీత, పల్లె రఘునాధరెడ్డి లాంటి వాళ్ళకు బినామీలుగా అనుమానిస్తోంది. అందుకనే బినామీల పని పట్టేందుకు మొత్తం కేసును ఈడికి బదిలీ చేసింది. దాంతో రంగంలోకి దిగిన ఈడి అధికారులు తాజాగా ఇద్దరు మాజీ మంత్రులు ప్రత్తిపాటి, నారాయణపై కేసులు నమోదు చేసినట్లు ప్రచారంలో ఉంది. తాజా డెవలప్మెంట్ తో టిడిపిలో ప్రకంపనలు మొదలయ్యాయి. మొత్తానికి ఈడి దర్యాప్తు ఊపందుకుంటే ఇంకెంతమంది తగులుకుంటారో చూడాల్సిందే.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: