సందట్లో సడేమియా అన్నట్టు... కరోనానూ క్యాష్‌ చేసుకుంటున్నాయి కొన్ని బ్యాచ్‌లు. ఓ వైపు కరోనా మహమ్మారి వేలాది మందిని పట్టి పీడిస్తుంటే... కరోనాను మటుమాయం చేస్తామంటున్నారు కొందరు మాయగాళ్లు. నిజానిజాలెలా ఉన్నా... ఎక్కడ కరోనా వస్తుందోనన్న అతి జాగ్రత్త పరులే టార్గెట్‌గా అవి తినండి... ఇవి తాగండి అంటూ.. తోచిందల్లా చెప్పేస్తున్నారు. 

 

కరోనా వైరస్‌...! ఈ పేరు వింటేనే ప్రపంచ దేశాలకు హడల్‌. ఇప్పటికే ఇండియాతో సహా కొన్ని దేశాలకు ఈ మహమ్మారి ఎంట్రీ ఇచ్చింది. చైనాలో వందలాది మంది పిట్టల్లారాలి మృత్యవాత పడుతున్నారు. ఏమాత్రం జలుబొచ్చినా.. దగ్గొచ్చినా... బీ అలర్ట్‌ అంటున్నారు డాక్టర్లు. 

 

చైనాలోని వూహాన్‌లో మొదలైన కరోనా వైరస్‌... ఇప్పటికే వందలాది మందిని బలిగొంది. మరో వేలాది మందిని పట్టిపీడిస్తోంది. కరోనా వైరస్‌ పుట్టిన దేశం చైనాలోనే ఈ వైరస్‌కి విరుగుడు ఇప్పటికీ దొరకలేదు. ప్రపంచదేశాలు సైతం ఈ వైరస్‌ ని తరిమికొట్టే మందు కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. కొన్ని దేశాలు ఏకంగా రెడ్‌ అలర్ట్‌ ప్రకటించాయి. చైనా నుంచి స్వదేశాలకు తిరిగి వెళ్తున్న వారిలో... ఎవరికైనా ఏమాత్రం జలుబు దగ్గు ఉన్నా... ఫ్లైట్‌ కూడా ఎక్కించుకోవడం లేదు. 

 

పరిస్థితులు ఇంత తీవ్రంగా ఉంటే... కొందరు మాయగాళ్లు కరోనానూ క్యాష్‌ చేసుకోవడం మొదలుపెట్టారు. శ్వాస వ్యవస్థపై ప్రభావం చూపే ఈ వైరస్‌ను 1960లోనే కనుగొన్నారని... ఇన్నాళ్లు నిద్రావస్థలో ఉన్న వైరస్‌ ఒక్కసారిగా జడలు విప్పుకుందని ప్రచారం చేస్తున్నారు కొందరు. చెన్నైకి చెందిన ఓ వైద్యుడు కరోనా నివారించే మందు కనుక్కున్నాని అంటున్నాడు. తాను తయారు చేసిన ఔషదాన్ని తాగితే 24 నుంచి 48 గంటల్లోనే కరోనా దరికి చేరదంటున్నాడు. కరోనా లక్షణాలను బట్టి వనమూలికలతో ఔషదం తయారు చేశానంటున్నాడు డాక్టర్‌ ధనికసాలం వేణి. 

 

మా హోటల్‌లో ఒక్క ఊతప్ప తినండి చాలు... కరోనానే కాదు దాని జేజమ్మ కూడా ఏం చేయలేదు అంటున్నాడు చెన్నైలోని ఓ హోటల్‌ ఓనర్‌. చిన్న ఉల్లిపాయల్లో ఫ్లూ నివారణ శక్తిని పెంచే లక్షణాలు ఉంటాయని ఆ ఉల్లిపాయలతో మేము చేసిన ఊతప్పం తినండి అంటూ ఏకంగా హోటల్‌ ముందు బోర్డు పెట్టాడు. చైనాలో సోకిన కరోనా వైరస్‌కి.... జీడిమెట్లలో ముందు దొరికిందట. జలుబు, దగ్గు అని నిర్లక్ష్యం చేయకండి.. ఖచ్చితంగా కరోనా అయ్యింటుందని ఔషద మాత్రలు అమ్ముతున్నాడో వ్యక్తి. కాలనీలో ప్రచారం చేస్తూ... అమ్మతున్నాడంట ఓ వ్యక్తి. 

 

కాక్‌టెయిల్‌ పెగ్గు ఒక్కటి వేస్తే చాలు... కరోనా క్షణాల్లో మాయమవుతుందంటున్నారు థాయిలాండ్‌ డాక్టర్లు. థాయిలాండ్‌లో కరోనా సోకిన ఓ రోగికి హెచ్‌ఐవీ డ్రగ్స్‌ లోపినావిర్‌, రోటైనావిర్‌, ఒసెల్టామివర్‌తోపాటు... కాక్‌టెయిల్‌ మందు ఇవ్వగా... రోగికి కరోనా నయం అయింది అంటున్నారు. 

 

హోమియోపతి మందులు వాడండని ఒకరు... అల్లోపతి మందులు వాడండని మరోకరు... నాటు వైద్యమని మరికొందరు... పరిగడపున నేను చెప్పిన డైట్‌ చేసి పచ్చికూరలు తింటే చాలని మరికొందరు... ఇలా ఎవరికి తోచిన రీతిలో వారు చెప్తూ ప్రజలను మభ్యపెడుతున్నారు. ఎవరిమాటల్లో ఎంత నిజముందే తెలియని అమాయక ప్రజలు... అతిజాగ్రత్తలో మాయగాళ్ల మాటలు వింటున్నారు. వీరినే టార్గెట్‌ చేస్తూ... టార్గెట్‌ చేసుకుంటున్నారు కొందరు కేటుగాళ్లు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: