తెలంగాణాలో జరిగే అతిపెద్ద, విశిష్ట గిరిజన జాతరగా మేడారం సమ్మక్క-సారలమ్మల జాతరను చెప్పవచ్చు. ములుగు జిల్లా, తాడ్వాయి మండలానికి చెందిన మేడారం గ్రామంలో జరిగే ఈ గిరిజన జాతర రెండు సంవత్సరాలకు ఒక సారి జరుగుతుంది. సుమారు 900 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ జాతరను 1940 వ సంవత్సరం వరకు చిలుకల గుట్టపై గిరిజనులు మాత్రమే జరుపుకునే వారు, కాని 1940 తర్వాత తెలంగాణా ప్రజలంతా కలిసి జరుపుకోవడం ఆరంభించారు. ఇక ఏటేట ఈ జాతరకు వచ్చే జనవాహిని పెరుగుతుండడంతో జాతరను కొండ కింద జరపడం ప్రారంభించారు. అక్కడ అమ్మవార్ల చిహ్నంగా గద్దెలు ఏర్పాటుచేయబడి ఉంటాయి. ఈ గద్దెలపైకి జాతర రోజు అమ్మవార్ల ప్రతిరూపాలుగా ఉన్న కుంకుమ భరిణెలను తీసుకువస్తారు. పూర్తిగా గిరిజన సాంప్రదాయంలో జరిగే ఈ జాతరకు తెలంగాణా నుండే కాకుండా ఆంధ్ర, మధ్య ప్రదేశ్, చత్తీస్ ఘడ్, 

 

మహారాష్ట్ర, ఒడిషా రాష్ట్రాలనుండి సుమారు కోటికి పైగా భక్త జనం వచ్చి అమ్మవార్లను దర్శించుకుని తమ మొక్కులను తీర్చుకుంటారు. దేశంలోనే అతి పెద్ద గిరిజన జాతరగా పేరెన్నికగన్న ఈ జాతరకు ఏటేటా తెలంగాణ ప్రభుత్వం కూడా సకల సౌకర్యాలతో కూడిన పటిష్ట భద్రత కూడా ఏర్పాటు చేస్తుంది. మామూలుగా జాతర అంటే గద్దెలు, అమ్మవార్లు మాత్రమే కాదని మనందరం గుర్తుంచుకోవాలి. జాతర అంటే కుటుంబ సమేతంగా కలిసి, కష్టసుఖాలను పంచుకుంటూ బయలుదేరే ఒక సంప్రదాయం వంటిదే అని అందరూ గ్రహించాలి. 

 

ఇక ఈ ఏడాది కూడా మేడారం సమ్మక్క, సారక్క అమ్మవార్ల మేడారం జాతర ఎంతో వైభవంగా ప్రారంభం అయింది. ఇక ప్రజలు ఎంతో నియమ నిష్టలతో, ఆనందంతో ఆ తల్లులిద్దరికీ ధూప, దీప నైవేద్యాలు అందించడంతో పాటు తమ మొక్కులను కూడా ఈ జాతరలో తీర్చుకుంటున్నారు. ముఖ్యంగా సంతానం కలిగిన భక్తులు తొట్టెల (ఊయల) కట్టి మొక్కు తీర్చుకుంటారు. అనంతరం జంపన్నవాగులో పుణ్యస్నానం ఆచరించి సమీపంలో ఉన్న చెట్టు వద్ద తొట్టెల కట్టి మొక్కు చెల్లించుకుంటారు. తమ సంతానాన్ని దీవించాలని ప్రార్థిస్తారు. జంపన్న వాగుతోపాటు మేడారం ప్రాంగణంలో జువ్వి చెట్టు వద్ద కూడా ఊయల కట్టి మొక్కు చెల్లించడం సంప్రదాయం. ఆ విధంగా చేయడంవలన ఆ తల్లుల చల్లని దీవెనలు బిడ్డలపై ప్రసరింపబడి, వారి జీవితాలు ఎంతో ఆనందంగా సాగుతాయని ప్రతీతి....!!

మరింత సమాచారం తెలుసుకోండి: