అనంతపురం జిల్లాలో ఉన్న కియా కార్ ప్లాంట్ ఏపీ నుంచి తరలిపోతోందన్న రాయిటర్స్ కథనం కలకలం రేపింది. పార్లమెంట్ లో ఈ అంశాన్ని లేవెనత్తిన  టీడీపీ.. వైసీపీ సర్కారు విధానాల కారణంగానే పరిశ్రమలు వెళ్లిపోతున్నాయని ఆరోపించింది. అయితే టీడీపీకి గట్టిగా కౌంటరిచ్చిన వైసీపీ.. కియా ఎక్కడకూ వెళ్లడం లేదని, కథనాల్లో వాస్తవం లేదని స్పష్టత ఇచ్చింది. 

 

కియా ప్లాంట్‌ను తరలిస్తున్నారంటూ రాయిటర్స్ లో కథనం వచ్చింది. అనంతపురంలో ఉన్ ప్లాంట్ ను పొరుగు రాష్ట్రం తమిళనాడుకు తరలించడానికి.. ప్రాథమిక చర్చలు కూడా మొదలయ్యాయని రాసింది. మాజీ మంత్రి లోకేష్ కూడా ఏపీ ప్రజలు ఏం పాపం చేశారని ట్వీట్ చేశారు. కియా రాష్ట్రం విడిచి వెళ్లిపోతే.. యువత భవిష్యత్ కు పెద్ద దెబ్బేనని ఆవేదన వ్యక్తం చేశారు. 

 

అయితే కియా విషయంలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అది ఎక్కడికీ వెళ్లడం లేదని ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి స్పష్టం చేశారు. కియా పరిశ్రమ యాజమాన్యం సంతృప్తికరంగా ఉన్నప్పుడు..ఇలాంటి దుష్ప్రచారం చేయడం తగదని మండిపడ్డారు. తప్పుడు ప్రచారంతో ప్రజలను కొందరు తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. బాధ్యులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. 

 

అటు కియా మోటార్స్‌ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. ప్లాంట్‌ను తరలించే ఆలోచనలేవీ లేవని వెల్లడించింది. ఏపీలో తమ ప్లాంట్ అద్భుతంగా పనిచేస్తోందన్న కియా యాజమాన్యం.. ఈ వార్తలు తమకు ఆశ్చర్యం కలిగించాయని చెప్పింది. మరోవైపు టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు కియా అంశాన్ని పార్లమెంట్ లో ప్రస్తావించారు. వైసీపీ ప్రభుత్వ విధానాల కారణంగానే కియా ఇలాంటి ఆలోచనలు చేస్తోందని ఆరోపించారు. 

 

అయితే కియా ఎక్కడకూ వెళ్లడం లేదని, తాను ఆ కంపెనీ ఎండీతో కూడా మాట్లాడానని చెప్పారు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి. కొందరు ఉద్దేశపూర్వకంగా తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. కియా ప్లాంట్ ఏపీ ప్రభుత్వ వ్యవహారశైలితో సంతృప్తికరంగానే ఉందని చెప్పారు మిథున్ రెడ్డి. గతేడాది డిసెంబరులో కియా ఆంధ్రా ప్లాంట్‌ను ప్రారంభించింది. ఏడాదికి మూడు లక్షల యూనిట్లను ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉన్న ఈ ప్లాంట్‌లో 12వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: